
-ఫ్లై యాష్ స్కామ్ లో మంత్రి ఎందుకు స్పందించడం లేదు
-అవినీతి పనులకు సహకరించే కాంగ్రెస్ పార్టీ నాయకులను ఊళ్ళల్లో తిరగనివ్వం
-ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ ని విమర్శించే స్థాయి ప్రణవ్ కి లేదని బీఆర్ఎస్ సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి అన్నారు. గురువారం హుజురాబాద్ లోని ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వారం రోజులుగా ఫ్లై యాష్ స్కాం గురించి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రి కనుసన్నలోనే స్కామ్ జరుగుతుందని ఆధారలతో నిరూపిస్తే ఇప్పటివరకు మంత్రి ఎందుకు స్పందించడం లేదని ఆయన పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫ్లై యాష్ ను రామగుండం నుంచి ఖమ్మంకి తరలిస్తూ కోట్లు గడిస్తున్నారని, ఇందులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు మంత్రికి కూడా ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు. నిబంధనలకు లోబడి యాష్ తరలిస్తే తమకి ఇబ్బంది లేదని ఎమ్మెల్యే చెప్పినప్పటికీ హుజురాబాద్ మార్గం గుండా కాకుండా హుస్నాబాద్ నుంచి ఫ్లై యాష్ తరలించడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. హుజురాబాద్ ప్రజల ఓట్లతోటి గెలిచిన ఎమ్మెల్యేగా హుజురాబాద్ ప్రజలు సమస్యలపై స్పందిస్తుంటే ఎమ్మెల్యేను అడ్డుకుంటామని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. సొంత ఊర్లో మెజారిటీ తీసుకురాని ప్రణవ్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని రోడ్లమీద తిరుగనివ్వమని చెబుతున్న కాంగ్రెస్ నాయకులను అవినీతిపరులకు సహకరిస్తే మిమ్మల్ని తిరగనివ్వమని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గూడూరు ప్రతాప్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు డాక్టర్ సంగం ఐలయ్య, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎం శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇరుమళ్ళ సురేందర్ రెడ్డి, పోతరవేణి అనిల్ యాదవ్, కొండ్ర నరేష్, మిడిదొడ్డి అశోక్, మాజీ సర్పంచులు మిడిదొడ్డి ఎల్లయ్య, కన్నబోయిన తిరుపతి, మండ సతీష్ గౌడ్, తాళ్లపల్లి వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.







