
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: విద్యాసంస్థలు ప్రారంభమైనప్పటికి విద్యాశాఖకు మంత్రిని
నియమించకపోవడం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన చేతగానితనానికి నిదర్శనం అని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోస్కుల అజయ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మద్యం శాఖ మీద ఉన్నంత దృష్టి విద్యాశాఖపై ఉండకుండా పోయిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖకు మంత్రిని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో కల్లబొల్లి కబుర్లు, మోసపూరితమైన వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం ఎంతవరకు సమంజసమని అజయ్ ప్రశ్నించారు. విద్యార్థులకు దిశా నిర్దేశం చేయాల్సిన శాఖకు మంత్రి లేకపోవడం వల్ల సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని
వెల్లడించారు. రానున్న రోజుల్లో అన్ని పరీక్షలు నిర్వహించడంతో పాటు పలు రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలను పటిష్టంగా నిర్వహించాల్సి ఉందన్నారు. ఇందుకు అనుగుణంగా విద్యాశాఖకు తక్షణమే మంత్రిని నియమించి విద్యాశాఖ సమస్యలు పరిష్కరించాలని కోరారు.






