మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ జిల్లా చొప్పదండి శాసనసభ్యుడు (ఎమ్మెల్యే) మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి హైదరాబాద్ అల్వాల్ లోని పంచశీల కాలనీలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ద్వారా తెలిసింది. ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న రూపాదేవి అకస్మాత్తుగా ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం పలువురిని విస్మయానికి గురిచేస్తుంది. 12 ఏళ్ళ క్రితం రూపదేవిని మేడిపల్లి సత్యం ప్రేమ వివాహం చేసుకున్నారు. రూపాదేవి మేడ్చల్ మునిరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కొంపల్లిలోని సంవత్సర కాలంగా పేట్ బషీరాబాద్‌లోని దవేరియా విల్లాస్‌లో సత్యం దంపతులు నివాసం ఉండేవారు. నెల రోజులు క్రితమే అల్వాల్‌లోని పంచశీల కాలనీ రోడ్ నంబర్ 12 కి మారారు. సత్యం, రూపాదేవి దంపతులకు కుమారుడు యోజిత్ (11) కుమార్తె రిషిక శ్రీ (9) ఉన్నారు. గత కొంతకాలంగా ఎమ్మెల్యే దంపతుల మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. భార్య మృతిని తట్టుకోలేక హాస్పిటల్లో సత్యం కూడా స్పృహ తప్పి పడిపోయారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సత్యంను పరామర్శించారు. రూపాదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు. పోలీసుల విచారణ అనంతరం గానీ ఆత్మహత్య గల కారణాలు తెలిసే అవకాశాలు లేవు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన రూపాదేవి తన భర్త ఎమ్మెల్యే అయిన తర్వాత సంతోషంగా కొడుకు, కూతురుతో కలిసి ఉంటున్న సమయంలో అనుకోకుండా ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడంతో చొప్పదండి నియోజకవర్గ ప్రజలు ఒక్కసారిగా దుఃఖ సాగరంలో మునిగిపోయారు.