
-అధికారులు తస్మాత్ జాగ్రత్త… పద్ధతి ప్రకారం నడుచుకోండి
-ఇల్లీగల్ పనులకు లీగల్ నోటీసులు సరిపోవు
-అవ్వ తాతల పెన్షన్ ఏది….
-తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం తథ్యం
-హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఫ్లై యాష్ స్కాంలో మంత్రి పొన్నం ప్రభాకర్ డబ్బులు తీసుకోలేదని అపోలో వెంకటేశ్వరస్వామి మీద ఒట్టేసి చెబితే బహిరంగ క్షమాపణకు సిద్ధంగా ఉన్నానని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ కు సవాల్ విసిరారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం 11 గంటలకు అపోలో వెంకటేశ్వరస్వామి దేవాలయానికి వస్తానని, మంత్రి పొన్నం కూడా అక్కడికి రావాలని ఫ్లై యాష్ స్కాంలో డబ్బులు తీసుకోకుంటే వచ్చి దేవుడు సాక్షిగా ప్రమాణం చేయాలని అన్నారు. ఒకవేళ బుధవారం వెంకటేశ్వరస్వామి దేవాలయానికి రాకుంటే అదే సమయంలో మీడియా సాక్షిగా మరికొన్ని నిజాలు బయటపెడతానని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలిచిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను చెక్కులు పంపిణీ చేయకుండా అడ్డుకోవడం సరైంది కాదన్నారు. జీవో నెంబర్ (18 )2016 ప్రకారం చెక్కుల పంపిణీకి ఎమ్మెల్యే కే పూర్తి అధికారం ఉందని ఆయన అన్నారు. చెక్కుల పంపిణీ చేయాలని ఎమ్మార్వోలకు ఇప్పటికే సమయం కేటాయించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ మంత్రి పొన్నం ప్రభాకర్ సమయం ఇవ్వాలంటూ దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. హుజురాబాద్ కు వచ్చిన 381 చెక్కులను ఎందుకు పంచనివ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. లబ్ధిదారులకు ఇబ్బందులు తలెత్తితే చూస్తూ ఊరుకోనని హుజురాబాద్ ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తానని ఆయన హెచ్చరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కి నాపైన ఏదైనా కోపం ఉంటే నా మీద తీర్చుకోవాలి తప్పా ప్రజల మీద కాదన్నారు. ఈనెల 27 తారీకు వరకు చెక్కుల సమయం ముగుస్తున్నప్పటికీ ఎందుకు పంచడం లేదో చెప్పాలన్నారు. కలెక్టర్ నుంచి మొదలుకొని కిందిస్థాయి అధికారుల వరకు పద్ధతి ప్రకారం నడుచుకోవాలని లేనియెడల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. నిబంధనలు అతిక్రమించిన అధికారులకు సంబంధించి బ్లాక్ బుక్కు ప్రిపేర్ చేశామని ప్రస్తుతం తప్పించుకున్నప్పటికీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు అధికారులు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. గతంలో కూడా చెక్కుల పంపిణీ విషయంలో మంత్రి మాటలు విన్న అధికారుల పరిస్థితి ఏమైందో గమనించుకోవాలన్నారు. చెక్కుల పంపిణీలో అవినీతికి పాల్పడిన అధికారులు జైలుకుపోయిన సంఘటన గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లో వాళ్లే చెక్కుల పంపిణీ చేసుకున్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచిన మేము చెక్కులు ఎందుకు ఇవ్వకూడదని ఆయన ప్రశ్నించారు. మమ్మల్ని కూడా ప్రజలే ఓట్లు వేసి గెలిపించుకున్నారు కదా అని అన్నారు. చెక్కులు పంపిణీ విషయంలో మాకు ప్రాధాన్యత ఇవ్వకుంటే సంబంధిత అధికారులను పార్టీ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేస్తామని ఆయన అన్నారు. చెక్కుల పంపిణీ విషయంలో మంత్రి అధికారులను బెదిరిస్తున్న ఆడియోను కూడా మీడియా ముందు ఉంచామన్నారు. ఫ్లై యాష్ స్కామ్ లో కౌశిక్ రెడ్డికి, సంతోష్ రావు, టీ న్యూస్, నమస్తే తెలంగాణకు నోటీసు పంపించామని చెబితే సరిపోదని, అక్రమ దందాలకు లీగల్ నోటీసులు పంపించామని సర్ది చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. మీరు పంపించిన లీగల్ నోటీసులకు మా లీగల్ సెల్ నుంచే సమాధానం వస్తుందన్నారు. ట్రాన్స్పోర్ట్ మంత్రిగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఒకటే సవాల్ విసురుతున్నాను అని, ఓవర్ లోడ్ లారీలో పోవచ్చా సమాధానం చెప్పాలన్నారు. 16 టైర్ల లారీలో 32 టన్నుల యాష్ పోవాల్సి ఉంటే 80 టన్నులు ఎలా పోతుందో సమాధానం చెప్పాలన్నారు. ఎమ్మెల్యేగా ఉండి లైవ్ లో లారీలను పట్టుకొని స్కాం బయటపెట్టినప్పటికీ ఇప్పటికీ లారీలు అలానే యాష్ తరలించడం వెనక ఆంతర్యం ఏమిటి అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ నెల నుంచి అవ్వ, తాతలకు ఇంట్లో రెండు పెన్షన్లు ఇస్తామని చెప్పారని, డిసెంబర్ నుంచి ఇప్పటివరకు రెండో పెన్షన్ తో పాటు నాలుగు వేలకు పెంచుతామన్న పెన్షన్ మొత్తం కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు ఆరు గ్యారెంటీలో భాగంగా రైతులకు రుణమాఫీ, రైతుబంధు, కొనుగోలు పై బోనస్ కూడా వెంటనే ఇవ్వాలన్నారు. ముఖ్యంగా పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకు లక్ష 116 తో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలన్నారు. కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ విడిచి వేరే పార్టీలోకి వెళ్తున్నారని, బీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదని ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పోయిన పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి తప్పకుండా వస్తుందని అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడిపోయిన ఏ ఒక్క నాయకుని కూడా తిరిగి పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే బీఆర్ఎస్ క్యాడరే పటిష్టంగా ఉందని, తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరం కార్యకర్తల కష్టపడతామని అన్నారు. పదేళ్ల కెసిఆర్ పాలనలో అభివృద్ధి జరిగే లేదని చెప్పే దమ్ము ఎవరికైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. దేశంలో కాంగ్రెస్, బిజెపి పాలిత ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రం కంటే ఏదైనా రాష్ట్రం అభివృద్ధిలో ఉందా చెప్పాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు.







