
–శిశు మందిర్ వల్లే జనం కోసం లాఠీదెబ్బలు…కేసులు…జైళ్లు అలవాటయ్యాయి..
–మతం ముద్రవేసి శిశు మందిర్ కు నిధులివ్వడం లేదు
–మిషనరీలు, మదర్సాలకు మాత్రం పెద్ద ఎత్తున నిధులు, జీతాలిస్తున్నారు
–దేశభక్తి, సంస్క్రుతి, ఆచారాలను కొనసాగిస్తున్న ఏకైక విద్యా సంస్థ శిశు మందిర్
–శిశు మందిర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది
–కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
–హుస్నాబాద్ లో సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణం ప్రారంభించిన సంజయ్దా
–దాపు రెండున్నర గంటలపాటు శిశు మందిర్ కార్యక్రమాల్లో గడిపిన బండి సంజయ్
–శిశు మందిర్ లో పాట ఆలపించిన సంజయ్
స్వర్ణోదయం ప్రతినిధి, హుస్నాబాద్: ‘‘ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేసులకు భయపడకుండా ఉద్యమాలు చేయగలిగానంటే, పోలీసు లాఠీల దెబ్బలను భరించానంటే, జైలుకు పోయానంటే సరస్వతి శిశు మందిరే కారణమని, శిశు మందిర్ లో చదువుకోవడం వల్లే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానని గర్వంగా చెబుతా.’’అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మదర్సాలకు, మిషనరీ సంస్థలు నడిపే స్కూళ్లకు పెద్ద ఎత్తున నిధులు, జీతాలిస్తున్న పాలకులు, సంస్థలు మతం ముద్రవేసి సరస్వతి శిశుమందిర్ కు నిధులివ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ భక్తి, మన సంస్కృతి, సంప్రాదాయాలను కొనసాగిస్తున్న ఏకైక విద్యా సంస్థ శిశు మందిర్ మాత్రమేనని, ఇలాంటి పాఠశాలలను ప్రోత్సహించాల్సిన అవసరం సమాజంలో మనందరిపైనా ఉందన్నారు.
హుస్నాబాద్ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్ కుమార్ కు పాఠశాల విద్యార్థులు బ్యాండు మేళాలతో ఘన స్వాగతం పలికారు. ‘విద్యా పీఠం’ దక్షిణ క్షేత్ర ప్రాంత కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డితో కలిసి సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల నూతన భవన సముదాయాన్ని ప్రారంభించారు. పాఠశాలలోని అన్ని గదులను కలియ తిరిగి పరిశీలించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో బండి సంజయ్, సుధాకర్ రెడ్డితో పాటు పెద్దపల్లి అదనపు కలెక్టర్ జివి శ్యాంప్రసాద్ లాల్, శ్రీధర్, హుస్నాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ ఆకుల రజిత, వైస్ ఛైర్మన్ అనితా శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు శ్రీనివాస్, శిశు మందిర్ భవన నిర్మాణ అధ్యక్షులు కొత్తపల్లి అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రసంగించడంతోపాటు శిశుమందిర్ లో తాను చిన్నప్పుడు పాడుకునే ఓ గీతాన్ని ఆలపించారు. ‘‘ఈ భూమి బిడ్డలందరం. హిందువులం అందరం. కష్టసుఖాల్లో కలిసి మెలిసి ఉంటుంటే బతుకు సుఖమయ్యేనురా. బంగారు కలలన్నీ పండేనురా’’ అంటూ ఆలపించిన గీతం అందరినీ ఆకట్టుకుంది. అంతకుముందు తన ప్రసంగంలో సంజయ్ ఏమన్నారంటే… మదర్సా, మిషనరీ స్కూల్స్ భవనాలు నిర్మించాలంటే రోజుల్లోనే పూర్తి చేస్తారు.. వీటికి పెద్ద ఎత్తున నిధులిస్తున్నారు. పెద్ద ఎత్తున జీతాలిచ్చేందుకు ముందుకొస్తున్నరు. కానీ దేశ సంస్క్రుతి, దేశ భక్తి పెంపొందిస్తున్న శిశు మందిర్ భవనాల నిర్మాణాలు పూర్తి కావాలంటే సంవత్సరాలు పడుతోంది. మతం ముద్రవేసి నిధులివ్వరు. ఇతర పాఠశాలల్లో భరత నాట్యం బంద్ అయ్యింది. కూచిపూడి అడ్రస్ కోల్పోయింది. బ్రేక్, షేక్ డ్యాన్సులకే పరిమితమవుతున్నారు. మన దేశ సంస్క్రుతి, సాంప్రదాయాలను కొనసాగిస్తూ దేశభక్తిని పెంపొందిస్తున్న శిశు మందిర్ లను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.
నేను శిశు మందిర్ పాఠశాల విద్యార్ధినని గర్వంగా చెబుతున్నా. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే శిశు మందిర్ వల్లే. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేయగలిగానంటే, పోలీసు లాఠీల దెబ్బలను భరించానంటే, జైలుకు పోయానంటే శిశు మందిరే కారణం. ఇలాంటి పాఠశాలలను ప్రోత్సహించాల్సిన అవసరం సమాజంలో మనందరిపైనా ఉంది. కార్పొరేట్ విద్యా సంస్థల వల్ల చిన్న చిన్న పాఠశాలలన్నీ మాయమైపోతున్నయ్. కార్పొరేట్ శక్తుల సొమ్ముతోనే ప్రభుత్వాలు నడిచే పరిస్థితి వచ్చింది. పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నా పట్టించుకోరనీ ఆరోపించారు.
శిశు మందిర్ లేకుండా విద్యా వ్యవస్థ పూర్తిగా నీరుగారే పరిస్థితి ఏర్పడిందనీ, శిశు మందిర్ లో చదివిన అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ సహా ఉన్నత ఉద్యోగాల్లో కొనసాగుతున్నారన్నారు. జాతీయ నాయకులయ్యారనీ. శిశు మందిర్ లో మమ్మీడాడీ, అంకుల్, ఆంటీ కల్చర్ ఉండదనీ.. అమ్మనాన్న సంస్కృతిని కొనసాగిస్తోందన్నారు. ఇంతటి గొప్ప ఆశయంతో కొనసాగుతున్న సరస్వతి శిశు మందిర్ లను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ బండి సంజయ్ పేర్కొన్నారు.







