
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పుడున్న సిలబస్‌ను సరళీకృతం చేసి 6 సంవత్సరాల లోపు పిల్లలందరికీ అంగన్వాడీల్లోనే బోధించేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ శ్రీకారం చుట్టిందని జిల్లా సంక్షేమ అధికారి ఎం. సరస్వతి తెలిపారు. నూతన సిలబస్ ప్రకారం పిల్లలకు బోధించేందుకు అంగన్వాడి టీచర్లకు నిర్వహిస్తున్న శిక్షణ ముగింపు కార్యక్రమంకు ఆమె హాజరయ్యారు. హుజురాబాద్ కెసి క్యాంపులోని ఐసిడిఎస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఇదివరకే శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు ప్రస్తుతం జిల్లాలోని అంగన్వాడీ టీచర్లందరికీ శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. జాతీయ విద్యావిధానం ప్రకారం 6 సంవత్సరాల లోపు పిల్లలంతా పూర్వ ప్రాథమిక విద్యకు మాత్రమే పరిమితం కావాలని అన్నారు. ఆటపాటల ద్వారా ప్రత్యేక సిలబస్‌తో అంగన్వాడీ కేంద్రాల్లో బోధన ఉంటుందని, 3 నుండి ఆరేళ్ల లోపు పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని సూచించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మార్గదర్శకాల ప్రకారం అంగన్వాడీలో నూతన సిలబస్ ప్రకారం విధిగా బోధించాలని అంగన్వాడి టీచర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ టి.భాగ్యలక్ష్మి, సూపర్వైజర్లు జి.రమాదేవి, సిహెచ్.జ్యోతి, టి.స్వరూప, మాస్టర్ ట్రైనర్ బి.ఉషారాణి పాల్గొన్నారు.







