
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
పట్టు పురుగుల పెంపకంలో సాంకేతిక యాజమాన్య పద్ధతులు పాటించి మంచి లాభాలు పొందవచ్చని పట్టు పరిశ్రమ శాఖ ములుగు సైంటిస్ట్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. గురువారం హుజురాబాద్ మండలంలోని తుమ్మనపల్లి గ్రామంలో పట్టుపురుగుల కేంద్రాలను ఆయన సందర్శించి పరిశీలించారు. సాగు చేస్తున్న రైతులను పలు వివరాలను తెలుసుకున్నారు. పురుగుల పెంపకంలో రైతులకు పలు సాంకేతిక అంశాలను తెలియజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎరువులు వేసే విధానం, రూట్ రాట్ వేరు కుళ్ళు, తుక్రా వ్యాధి నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. పట్టుపురుగుల పెంపకంలో అవసరమైన సాంకేతిక యాజమాన్య పద్ధతులు పాటించడం లేదని, దీనివల్ల పట్టు పురుగులకు పాలు కారు రోగం, సున్నపుకట్టు, ప్లాచరీ (సచ్చు రోగం), పెబ్రిన్ మొదలగు వ్యాధుల ద్వారానే కాకుండా ఊజీ ఈగ తాకిడి వల్ల కూడా రైతులు ఎక్కువగా నష్టపోతున్నారని తెలిపారు. దీంతో పంట నష్టం సుమారు 15-20 శాతం వరకు ఉంటుందన్నారు. ఊజీ తాకిడి వానకాలం, చలికాలంలో ఎక్కువగా ఉంటుందన్నారు. ఊజీ ఈగ వల్ల ఏర్పడే నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని దాని నియంత్రణ చర్యలు పాటించాలన్నారు. ఊజీ ఈగలు తన జీవిత చక్రంలోని లార్వాదశలను పట్టు పురుగులను ఆశించి అందులోని వివిధ కణజాలలను ఆహారంగా తీసుకుంటాయన్నారు. దాన్ని చొచ్చుకొని బయటకు వచ్చి కోశస్థ దశలుగా మారి మళ్లా పెద్ద పురుగులుగా మార్పు చెందుతాయన్నారు. ఇవి మొట్టమొదటగా మన దేశంలో 1980లో కర్ణాటక రాష్ట్రంలో కనబడినాయన్నారు. తర్వాత ఇతర రాష్ర్టాలకు వ్యాపించాయని, దీనివల్ల చాలామంది రైతులు నష్టపోతున్నారన్నారు. నియంత్రణ, యాజమాన్య పద్ధతులు ఊజీ ఈగ తాకిడి నియంత్రణ పద్ధతులను ఉపయోగించి సమగ్ర యాజమాన్యం ద్వారా నిర్మూలించవచ్చన్నారు. పెంపకపు గదిలోను, పరిసరంలోనూ చిన్న చిన్న రంధ్రాలను సిమెంట్‌తో పూడ్చాలన్నారు. ఊజీ బారిన పడిన 5వ దశ పట్టుపురుగులు లేదా 2 రోజుల ముందుగానే గూళ్లు అల్లుతాయని, వీటిని ముందుగానే గుర్తించి వేడి నీటిలో వేసి చంపాలన్నారు. పట్టు పురుగుల పెంపకం గదిలోనూ, పట్టు గూళ్ల విక్రయ కేంద్రంలోనూ, పట్టుగుడ్ల ఉత్పత్తి కేంద్రాల్లోనూ కిందపడిన ఊజీ ఈగలను ఎప్పటికప్పుడు ఏరి కాల్చివేయాలన్నారు. పట్టు పురుగుల పెంపకం గదికి నైలాన్ వలను అన్నివైపులా అమర్చాలన్నారు. మల్బరీ ఆకును పెంపకం గదిలోకి వెళ్లే దారిలో ముందు ఒక చిన్న గదిని నైలాన్ వలలో ఏర్పాటు చేయాలన్నారు. మల్బరీ ఆకులను నేరుగా తోసుకురాకుండా, మొదట ఉండే గదిలో ఈగలు లేని నిర్ధారించుకున్న తర్వాతే తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అధికారి డాక్టర్ గుండి రాఘవేందర్, హుజురాబాద్ డివిజన్ పట్టు పరిశ్రమ అధికారి మహమ్మద్ రషీద్, రైతులు గోపగోని ప్రవీణ్, సురకంటి స్వామిరెడ్డి, నర్రా స్వామిరెడ్డి, నిమ్మల స్వామిరెడ్డి, అరుణ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నందిరెడ్డి, బేతి గోపాల్ రెడ్డి, బద్దం రాజేశ్వర్ రెడ్డి, గొడిశాల శ్రీనివాస్, బొక్కల వేణు, సమ్మయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.







