
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ : రెండవ విడత దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద వరంగల్ – కరీంనగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత బంధు రెండో విడత సాధన సమితి నాయకులు మాట్లాడుతూ… గత ప్రభుత్వం హయాంలో దళితుల సంక్షేమం కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. వివిధ వ్యాపారాలు ఏర్పాటు చేసుకున్న దళిత బంధు లబ్ధిదారులకు సగం డబ్బులను మాత్రమే మంజూరు చేశారని, మిగతా డబ్బులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే దళిత బంధు నిధులను విడుదల చేయకపోతే మంత్రుల ఇళ్లను ముచ్చటిస్తామని వారు హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు దళిత బంధు రెండో విడత నిధుల విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. సుమారు గంట పాటు రాస్తారోకో చేయడంతో ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచి నిలిచిపోయాయి. ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రాస్తారోకో చేస్తున్న దళిత బంధు బాధితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో దళితబందు సాధన సమితి సభ్యులు కోలుగూరి సురేష్, కోలుగూరి నరేష్, అకినపల్లి ఆకాష్, ఇనుగాల బిక్షపతి, కోడెపాక రక్షిత్, దసరాపు నాగరాజు, మంద వేణు, రామంచ శ్రీకాంత్, పాత రాజేష్, గాజుల కుమార్, మహంకాళి రమేష్, విజయ్, సరిత, కుమార్ తదితర వందమందికి పైగా పాల్గొన్నారు.









