
-అదుపులోకి తీసుకున్న పోలీసులు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయలేదని ప్రభుత్వంపై బీఆర్ఎస్ భగ్గుమంది.
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హుజురాబాద్ MLA పాడి కౌశిక్ రెడ్డిల పిలుపు మేరకు హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద గురువారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు రైతులు నినాదాలు చేస్తూ అంబేద్కర్ చౌరస్తా చేరుకున్నారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు ధర్నా కొనసాగిస్తున్న వారిని వ్యాన్లో ఎక్కించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఆగస్టు 15 వరకు 31 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని చెప్పి కేవలం 17 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని అన్నారు. హరీష్ రావు 31 వేల కోట్లు రుణమాఫీ చేస్తేనే రాజీనామా చేస్తానని చెప్పారని దానిని గమనించాలని అన్నారు. రైతుల రుణమాఫీ విషయంలో 100శాతం రైతు రుణమాఫీ చేయకుండా మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.40,000 కోట్ల రుణమాఫీ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల సమయంలో తొమ్మిది వేల కోట్లు తగ్గించి 31 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పారని, బడ్జెట్లో మాత్రం 26 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, చివరికి కేవలం 17,934 కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారని అన్నారు. 31 వేల కోట్ల రుణమాఫీ 47 లక్షల మంది రైతులకు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని అన్నారు. రైతు రుణమాఫీ 46శాతం మంది రైతులకు మాత్రమే చేశారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని వెంటనే షరతులు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో హుజురాబాద్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్లు గందె రాధిక శ్రీనివాస్, తక్కలపల్లి రాజేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండాల్ రెడ్డి, సోషల్ మీడియా నాయకురాలు పావని గౌడ్, కౌన్సిలర్లు, నాయకులతో పాటు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










