
–తొలగించిన అధ్యాపక అధ్యాపకేతర ఉపాధ్యాయులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి
–టీజీపీఏ రాష్ట్ర అధ్యక్షులు.. అంబాల ప్రభాకర్ (ప్రభు)
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గత ఐదు నుండి పది సంవత్సరాలుగా తెలంగాణ ఎస్సీ గురుకులంలో పనిచేస్తున్నటువంటి అధ్యాపక, అధ్యాపకేతర ఉపాధ్యాయులను తొలగించినట్లు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల సెక్రటరీ డాక్టర్ విఎస్ అలుగు వర్షిని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ (టీజీపీఏ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీజీపీఏ రాష్ట్ర అధ్యక్షులు అంబాల ప్రభాకర్ ప్రభు మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా సుమారు 6000 మంది ఔట్సోర్సింగ్, పార్ట్ టైం, గెస్ట్ ఫ్యాకల్టీ, వ్యాయామ ఉపాధ్యాయులు, అసిస్టెంట్ కేర్ టేకర్ లు మా బిడ్డలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, నాణ్యమైన భోజనం, అందేలా కృషి చేసి వారి త్యాగాలను విద్యార్థిని విద్యార్థులకు నీతి నిజాయితీ ప్రేమతో కూడిన సేవలను అందించిన వారికి గత నెలలుగా జీతాలు ఇవ్వకుండా వాడుకొని వదిలేయడం సమంజసం కాదు అని అన్నారు.
అన్ని అర్హతలతో పాటు ఇంత కాలం పనిచేసిన, అపారమైన అనుభవం ఉన్న వారిని మళ్లీ కౌన్సిలింగ్ ఆధారంగా నోటిఫికేషన్ జారీ చేసి తీసుకోవడం ఏంటి అని ఎద్దేవ చేశారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సెక్రటరీ అలుగు వర్షిని ఐఏఎస్ తీసుకున్న వ్యతిరేక విద్యా విధానాన్ని వెనక్కి తీసుకొని పేద విద్యార్థులకు అనుకూలమైన పద్ధతిని ప్రవేశపెట్టాలని కోరారు.
సెక్రటరీ అలుగు వర్షిని ఐఏఎస్ పదవి బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి గతంలో ఉన్నటువంటి నాణ్యమైన విద్యా విధానాలు అన్నింటిని తుంగలో తొక్కుతూ తమకు ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తూ విద్యార్థిని విద్యార్థులకు అంధకారంలో నెట్టేస్తుందని మండిపడ్డారు.
గతంలో ఉన్నటువంటి విద్యావిధానాలన్నిటిని కూడా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
అనారోగ్యానికి గురైన విద్యార్థినీ విద్యార్థులకు కనీస హెల్త్ కమాండ్స్ సెంటర్ ను పునర్ ప్రారంభించాలని కోరారు
ఎస్సీ గురుకులాలలో బ్రహ్మకుమారి సంస్థచే విద్యార్థిని విద్యార్థులకు సైకాలజీ క్లాసులు నడిపించాలని ఒప్పందాన్ని వెంటనే రద్దు పరచి, శాస్త్రీయబద్ధమైన అర్హులైన సీనియర్ సైకాలజీ ఉపాధ్యాయులచే సైకాలజీ క్లాసులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. నిరుపేద విద్యార్థులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే నిరంకుశ వ్యతిరేక విద్యా విధానాన్ని ప్రవేశపెడుతున్న సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి డాక్టర్ అలుగు వర్షిని ఐఏఎస్ ను వెంటనే విధుల్లో నుండి తప్పించి విద్యార్థినీ విద్యార్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. లేనిచో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాల చదివే విద్యార్థుల తల్లిదండ్రులను ఏకం చేసి ప్రభుత్వంపై ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడిసె పవన్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, నిజనిర్ధారణ కమిటీ కన్వీనర్ దారా మధు తదితర రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.






