
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆటపాటలతో పూర్వ ప్రాథమిక విద్య బోధిస్తున్న అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారుల మనోవికాసం అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం సభ, పోషణ మాసోత్సవం కార్యక్రమాల్లో భాగంగా హుజూరాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన గ్రామ సభకు కలెక్టర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేట్ కు ధీటుగా అంగన్వాడీలో చక్కటి భోధన ఉంటుందని, అందుకు పెద్ద పాపయ్యపల్లి అంగన్వాడీ కేంద్రాలు ఆదర్శమని తెలిపారు. ప్రతి గర్భిణీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఖరీదుతో కూడిన స్కానింగ్ వంటివి ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మాతృ మరణాలు పరిశీలిస్తే సమయం ప్రకారం వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. గర్భిణీ ఆరోగ్య పరిస్థితి గురించి స్థానిక ఆరోగ్య కార్యకర్త, అంగన్వాడి, ఏఎన్ఎం సిబ్బందికి ఎక్కువగా అవగాహన ఉంటుందని, వారి సమక్షంలో ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కావడం మంచిదని సూచించారు. ప్రతి మంగళ, గురువారాల్లో ఆరోగ్యం మహిళ పరీక్షలు నిర్వహిస్తున్నామని, మూడు నెలలకు ఒకసారి మహిళలు తప్పక ఆరోగ్య పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చేయించుకోవాలని తెలిపారు.
అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించే ప్రతి కార్యక్రమం పై ప్రజలకు అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో శుక్రవారం శుభ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆశ, ఏఎన్ఎం, అంగన్వాడి సిబ్బంది గ్రామంలోని పిల్లలందరికీ సమయం ప్రకారం టీకాలు వేయించేలా చూడాలని ఆదేశించారు. మహిళలకు ఎటువంటి సమస్యలు ఉన్న శుక్రవారం సభలో ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
అనంతరం గర్భిణీలకు సీమంతం చేసిన కలెక్టర్ గ్రామపంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి రమేష్ బాబు, జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి, జిల్లా వైద్యాధికారి సుజాత, సిడిపిఓ సుగుణ, తహసిల్దార్ కనుకయ్య, ఎంపీడీవో సునీత తదితరులు పాల్గొన్నారు.





