–అధికారం కోల్పోయినా
బీఆర్ఎస్ బలుపు తగ్గలేదు..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: మహిళా మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా ట్రోల్ చేయడం దారుణమని, అధికారం కోల్పోయినా కూడా బీఆర్ఎస్ నేతలకు బలుపు తగ్గలేదని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు మండిపడ్డారు. మంగళవారం సాయంత్రం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు మంత్రి కొండా సురేఖ కాళ్లు మొక్కి చెంపలేసుకుని ముక్కు భూమికి రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి కొండా సురేఖ పై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ప్రతినిధులు అసభ్య పదజాలంతో ట్రోల్ చేయడం రాజకీయ విలువలను దిగదర్చడమేనని ధ్వజమెత్తారు. తామే నీతిమంతులమని తరచూ వ్యాఖ్యానించే కేసీఆర్, కేటీఆర్, కవిత వీటిపై ఏం సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. డబ్బులు ఇచ్చి పెంచి పోషించి సోషల్ మీడియా ప్రతినిధులతో ఇష్ట రాజ్యాంగ మహిళా మంత్రులను కించపరిచేలా ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సభ్య సమాజం సిగ్గు పడుతున్నదని, బీఆర్ఎస్ నేతలు మంత్రి కొండా సురేఖ కాళ్లు మొక్కి చెంపలేసుకుని, ముక్కు భూమికి రాసి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సోదర సమానుడు మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మంత్రి నూలు దండ వేస్తే దానిపై కూడా అసభ్యకరంగా ట్రోల్ చేయడం దారుణమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతల ఇంట్లో ఆడవాళ్ళ పైన ఇలాంటి ట్రోలింగ్ చేస్తే వారికి ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా ఇకనైనా ట్రోలింగ్ లు ఆపాలని లేకపోతే కఠినంగా వ్యవహరిస్తామని, చేతులకు బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. మంత్రి సురేఖ పై పెట్టిన పోస్టులను కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు ఖండించడం లేదని నిలదీశారు. అంటే వారే వెనుక ఉండి ఇలా చేయిస్తున్నారనే అనుమానం కలుగుతుందని, దీనికి వారు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులను అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు.