మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గత 2 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడం మరియు ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో కూడా ఉన్నత విద్య పూర్తిగా నిర్లక్ష్యంకు గురి కావడం, ఫీజు బకాయిల గురించి ఎన్ని సార్లు మంత్రులు, అధికార్ల చుట్టూ తిరిగినా, ముఖ్యమంత్రిని ఎన్ని సార్లు కలుద్దాం అని ప్రయత్నించినా కనీసం సమయం ఇవ్వక పోవడంతో దసరా తర్వాత డిగ్రీ కళాశాలలు బంద్ చేసేందుకు నిర్ణయించినట్లు శాతవాహన యూనివర్సిటీ ప్రైవేటు డిగ్రీ కళాశాలల సంఘం అధ్యక్షుడు వేంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి శ్రీపాద నరేష్ మరియు కార్యవర్గ సభ్యులు ఒక ప్రకటనలో
తెలిపారు. మంత్రులు, అధికారులు, ముఖ్యమంత్రి విద్యా సంస్థల సమస్యను కనీసం వినే ప్రయత్నం కూడా చేయకపోవడంతో డిగ్రీ కళాశాలల రాష్ట్ర అసోసియేషన్ నిర్ణయం మేరకు దసరా లోపు ఫీజు బకాయిలు చెల్లించకుంటే లేదా ఫీజు బకాయిలపై ముఖ్యమంత్రి నుండి స్పష్టమైన హామీ వచ్చేవరకు శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని అన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాలలు దసరా సెలవులు పూర్తి అయినా కళాశాలలు తెరవకూడదని నిర్ణయించామని తెలిపారు. ఇదే విషయాన్ని యూనివర్సిటీ అధికారులకు కూడా తెలుపుతామని శాతవాహన యూనివర్సిటీ ప్రైవేటు డిగ్రీ కళాశాలల సంఘం అధ్యక్షుడు వేంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి శ్రీపాద నరేష్ మరియు కార్యవర్గ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు.