
-జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం బతుకమ్మ పండుగ అని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం మహాత్మా జ్యోతిబా పూలె మైదానంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మహిళా అధికారులు, సిబ్బంది తాము రూపొందించిన బతుకమ్మల్ని ఒకచోట చేర్చి ఆట, పాటలతో సందడి చేశారు. అనంతరం మహిళలతో కలిసి జిల్లా కలెక్టర్ బతుకమ్మ పాటలకు ఆడిపాడారు. ఈ సందర్బంగా కలెక్టర్ బతుకమ్మ ప్రాముఖ్యతను వివరించారు. పూలనే పూజించి దేవతలుగా కొలుస్తున్న ఏకైక గొప్ప పండుగ బతుకమ్మ అని అన్నారు. మన పండుగ, మన సంస్కృతి మన సంప్రదాయం ఆడపడుచుల ఔన్నత్యానికి సూచిక అని అన్నారు.ప్రపంచవ్యాప్తంగా పూలను పూజించి ప్రకృతిని ప్రేమించే ఏకైక పండుగ బతుకమ్మ అని తెలిపారు.
అనంతరం బతుకమ్మలను అందంగా తీర్చిదిద్దిన వివిధ శాఖలకు బహుమతులు ప్రదానం చేశారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, మెప్మా, నగరపాలక సంస్థ, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, రెవిన్యూ శాఖ, సిపిఓ, జెడ్పి సహా పలు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బతుకమ్మలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీకిరణ్, ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్, టీఎన్జీవో నాయకులు, జిల్లా అధికారులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.







