
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భక్తుల కొంగుబంగారంగా భావించే హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలోని నవగ్రహ సహిత శ్రీ నాగేంద్ర స్వామి దేవాలయంలో కరీంనగర్, అమరావతికి చెందిన ఐఏఎస్ మిత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తపల్లి నాగేంద్ర స్వామి దేవాలయం మహిమల (విశిష్టత) గురించి తెలుసుకున్న ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఆలయాన్ని సందర్శించగా ఆలయ ప్రధాన పూజారి పందిళ్ళ భాస్కర్ శర్మ వారికి ప్రత్యేక పూర్ణకుంభ స్వాగతం పలికి నవగ్రహ పూజలు, దోష నివారణ పూజలు, పుట్ట పూజ, నవరసాభిషేకము, కుంకుమ పూజలు తదితర ప్రత్యేక పూజలు వారిచే చేయించారు. ఆలయ ప్రత్యేకతను తెలుసుకొని తామే వచ్చినట్లు ఈ సందర్భంగా ఐఏఎస్ లు వివరించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి ఆలయ సమీపంలో కళ్యాణ మండపం కావాలని వారిని కోరగా సంబంధిత మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో ఎస్టిమేషన్ వేసి ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. సుమారు గంటపాటు ఐఏఎస్లు ఆలయం వద్ద గడిపి ప్రత్యేక పూజలు చేయడంతో పలువురు ఆసక్తిగా వారిని తిలకించారు. వారి వెంట పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.









