
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గ కేంద్రంలో BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో రైతుల, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సిఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ నినాదాలతో హుజురాబాద్ మండల కేంద్రం ఫోరెత్తింది.
రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై హుజురాబాద్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రైతులు నిరసన కార్యక్రమాలకు పూనుకున్నారు. అధికారం కోసం రైతు భరోసా ఎకరానికి రూ. 15,000 ఇస్తామని మాయ మాటలు చెప్పి తీరా గద్దెనెక్కక రైతు భరోసాను పక్కనబెట్టి రోజుకో మాట మాట్లడుతూ రైతులను సీఎం రేవంత్ సర్కార్ మోసం చేస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజురాబాద్ సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండాల్ రెడ్డిలు పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రైతు భరోసా ఇవ్వలేమని సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలపై, కాంగ్రెస్ ప్రభుత్వం పై నమ్మకం పోయింది అన్నారు. అంతేగాక రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ, పాడి కౌశిక్ రెడ్డి నేతృత్వంలో రైతులు, నాయకులు, కార్యకర్తలు వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్, హుజురాబాద్ మండల కేంద్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు సంఘం ఐలయ్య, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, హుజురాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, రైతు సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






