
స్వర్ణోదయం ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా రూరల్ మండలం జాబితాపూర్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రధాన అనుచరుడు, మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి సోమవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. సంతోశ్ అనే వ్యక్తి గంగారెడ్డిని కారుతో ఢీకొట్టాడు. ఆ తర్వాత కత్తితో పొడిచినట్లు స్థానికులు తెలిపారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ గంగారెడ్డిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించినట్లు వెల్లడించారు. ఇక, గ్రామంలో రాజకీయ కక్షలే హత్యకి ప్రధాన కారణమని తెలుస్తుంది. దీంతో జగిత్యాల- ధర్మపురి ప్రధాన రహదారిపై బైఠాయించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తమ్మునిలాంటి వాడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాలలో బీఆర్ఎస్ రాజ్యం నడుస్తుందా.. లేదంటే కాంగ్రెస్ రాజ్యం నడుస్తుందాని అని ప్రశ్నించారు. కాంగ్రెస్ రాజ్యంలో కాంగ్రెస్ నాయకులకే రక్షణ కరువైందని మండిపడ్డారు. రాజకీయ కక్షలతో హత్యలకు పాల్పడడం ఆంధ్ర ఫ్యాక్షనిజాన్ని తలపిస్తుందని పలువురు ఆరోపించారు.







