Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సంక్షేమ పథకాలను విస్మరిస్తూ కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఊడిగం చేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి విమర్శించారు. బుధవారం రోజున హుజురాబాద్ మండల ప్రజా సంఘాల సమన్వయ కమిటీ సమావేశం కొప్పుల శంకర్ అధ్యక్షతన ప్రతాప సాయిరెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై వాసు దేవరెడ్డి మాట్లాడుతూ నాటి నుండి నేటి వరకు పేద ప్రజల పక్షాన కష్టజీవుల పక్షాన దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నది ఎర్రజెండానే అన్నారు. భారత జాతీయ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నది ఎర్రజెండా పార్టీ అని అన్నారు, భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించింది కమ్యూనిస్టు లేనన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశభక్తి పేరుతో దేశ సంపదను కార్పొరేట్లకు పప్పు బెల్లాళ్ల అమ్ముతూ ఆర్థిక అసమానతలను పెంచి పోషిస్తున్నారన్నారు. స్విస్ బ్యాంకు లో ఉన్న నల్లధనాన్ని బయటకి తెచ్చి జనధన్ ఖాతాలలో 15 లక్షలు వేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. నల్లధనం రాకపోగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టి దేశం నుండి అనేకమంది పెద్దలు పారిపోయారని చెప్పారు. ధరలు విపరీతంగా పెరుగుతున్న అరికట్టడంలో కేంద్రం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. భారత ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటి విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు రాకపోగా పది సంవత్సరాల కాలంలో సుమారు 18 లక్షల ఉద్యోగాలను తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలను చైతన్యం చేయాలని పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
దేశానికి స్వాతంత్రం వచ్చి 77 ఏండ్లు అవుతున్న పేదవాడికి సొంత ఇల్లు లేకపోవడం పేద ప్రజల పట్ల పాలకుల చిత్తశుద్ధి ఏమిటో స్పష్టమవుతుందని అన్నారు. ఉండడానికి ఇల్లు లేక, చేసుకోవడానికి చేతినిండా పనులు దొరక్క అద్దె ఇళ్ళలో ఉంటూ అనేక అవమానాలు భరిస్తున్నారని అన్నారు. ప్రతి పౌరుడికి తినడానికి తిండి కట్టు కోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు కల్పించాలనే భారత రాజ్యాంగ స్ఫూర్తిని పాలక ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.15 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు దాటుతున్న పేదోడు సొంతింటి కలగానే మిగిలిపోతుంది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో అతి ముఖ్యమైన గ్యారంటీ సొంత ఇంటి స్థలం ఉన్నవారికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్న హామీ నేటికీ అమలు కావడం లేదన్నారు. రేషన్ కార్డు లేక అనేక మంది కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయని వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయడానికి మార్గదర్శకాలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్, నాయకులు కదిరే రమేష్, ఎండి అజ్జు, కొమురెల్లి మల్లు, మధునమ్మ, చంద్రయ్య, శ్రీకాంత్, ప్రతాప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.







