Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ నవంబరు2: జిల్లాలలో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లోని సచివాలయం నుంచి ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ధాన్యం కొనుగోలుపై తీసుకోవాల్సిన చర్యల గురించి పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి డిఎస్.చౌహన్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమని, ఏ చిన్న ఇబ్బంది లేకుండా సమర్థవంతంగా ధాన్యం కొనుగోలు జరిగేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అన్నారు. ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టిందని అన్నారు. సన్న రకం ధాన్యం సాగు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్వింటాల్ 500 రూపాయల బోనస్ ప్రకటించిందని తెలిపారు. జిల్లాలో రూపొందించుకున్న ప్రణాళికల ప్రకారం దాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని, కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన ప్యాడీ క్లీనర్, ఇతర సామగ్రి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని అన్నారు.
దొడ్డు, సన్న రకం ధాన్యం కేంద్రాలను వేరువేరుగా ఏర్పాటు చేసి వేరువేరుగా స్టోరేజ్ చేయాలన్నారు. జిల్లాలో రైస్ మిల్లర్ల వద్ద తాలు పేరిట ధాన్యం కోతలు విధించవద్దని.. కొనుగోలు కేంద్రాల వద్ద నాణ్యత ప్రమాణాలు పరిశీలించిన తర్వాత కొనుగోలు చేయాలని, రైతుకు ఎటువంటి నష్టం రావడానికి వీలు లేదని మంత్రి స్పష్టం చేశారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకుని రావాలని మంత్రి సూచించారు. జిల్లాలోని రైస్ మిల్లర్లకు ధాన్యం కేటాయింపు కోసం బ్యాంకు గ్యారంటీ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసిందని, వీటిని కట్టుదిట్టంగా అమలు చేయాలని అన్నారు. రైస్ మిల్లర్లతో సమావేశాలు నిర్వహించాలని, జీఓ 27 పై చర్చించాలని, రైస్ మిల్లర్లచే బ్యాంక్ గ్యారంటీ సమర్పిస్తామని అండర్ టేకింగ్ తీసుకుని ధాన్యం కేటాయింపు చేయవచ్చని అన్నారు. రైస్ మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ సమర్పించని పక్షంలో జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం భద్ర పరిచేందుకు అవసరమైన మేర ఇంటర్మీడియట్ గో డౌన్ సన్నద్ధం చేయాలని, ప్రతి జిల్లాలో ధాన్యం కొనుగోలు ఫోన్ నెంబర్ తో కూడిన గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 48 గంటల్లో చెల్లింపులు పూర్తయ్యేలా చూడాలని అన్నారు. పక్క రాష్ట్రాల ధాన్యం మన కొనుగోలు కేంద్రాలకు రాకుండా బార్డర్ల వద్ద చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు..కరీంనగర్ జిల్లా నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన జీవో 27 పై రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించామని, ముందుగా రైస్ మిల్లర్లు అండర్ టేకింగ్ సమర్పించి తర్వాత బ్యాంకు గ్యారంటీలు సమర్పించాలని సమాచారం అందించామని, జిల్లాలో అవసరమైన మేర ఇంటర్మీడియట్ గోడౌన్లలో స్పేస్ అందుబాటులో ఉందని ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 340 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని.. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 303 కేంద్రాలకు రైతులు సుమారు 22,600 క్వింటాళ్ల పంటను తీసుకొచ్చారని అన్నారు. 28 కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లు పరిశీలించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొదట చిగురుమామిడి మండలంలో మూడు, రేణిగుంటలో ఒక కేంద్రం ప్రారంభించామన్నారు.
ఎప్పటికప్పుడు మండల స్పెషల్ అధికారులు, సివిల్ సప్లై అధికారులు కలిసి క్షేత్రస్థాయిలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. జిల్లాలో 153 మిల్లులు ఉండగా.. పంట తరలింపు లో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పుకొచ్చారు.
మిల్లర్ల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ హల్ నుండి డీఎం రజనీకాంత్, డీఎస్ఓ నర్సింగారావు, డీసీఓ రామానుజాచారి తదితరులు పాల్గొన్నారు.






