
–ప్రపంచ దేశాల సరసన రాష్ట్రం
–ముఖ్యమంత్రి కృషి, పట్టుదలతో తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి
–కాంగ్రెస్ కు ప్రజలంతా అండగా ఉండాలి..
–సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు
–కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నిరంగాల్లో రోల్ మోడల్ గా నిలుస్తున్నదని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్య మంత్రి నిరంతరం పట్టుదలతో కృషి చేస్తున్నారని చెప్పారు. గురువారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలకులు అప్పుల కుప్పగా మార్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి, సంక్షేమంలో పరుగులు పెట్టిస్తున్న ఘనత రేవంత్ రెడ్డి కే దక్కుతుందని తెలిపారు. ప్రజా సంక్షేమంతో పాటు రైతుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు.

హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేందుకు ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకొని ముందుకు సాగుతున్నారని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా క్రీడారంగం మరింత మెరుగుపరిచేందుకు స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో కమ్ముకున్న చీకట్లను పారద్రోలి రాష్ట్రంలో వెలుగులు నింపుతున్న మహనీయుడు రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని, వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో గత 10 ఏళ్లలో కేవలం 12 వేల కోట్ల రుణమాఫీ మాత్రమే చేసిందని విమర్శించారు. అన్నివర్గాల ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం ఎనిమిది నెలల కాలంలోనే 22 లక్షల 22,000 మందికి రుణమాఫీ చేశారని తెలిపారు. దీంతో వ్యవసాయాన్ని రైతులు పండుగలా చేసు కుంటున్నారని చెప్పారు. రైతులు రాజులుగా బతుకుతున్నారని, ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషివల్ల సాధ్యమైందని పేర్కొన్నారు. కేవలం 25 రోజుల్లోనే 18 వేల కోట్ల రుణమాఫీ చేయడం దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత అని వెలిచాల రాజేందర్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ప్రజాసేవలోనే నిమగ్నం కావాలని, తెలంగాణ రాష్ట్రాన్ని మరింత ప్రగతి పథాన ముందుకు తీసుకెళ్లాలని రాజేందర్ రావు ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వెలిచాల రాజేందర్ రావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.





