Oplus_131072
–దళిత బంధు నిధులు దారి మళ్లించింది వాస్తవం కాదా
–ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డికి తెలిసే అంతా జరిగింది
–దళిత బంధు పథకాన్ని పాకెట్ మనీ లా వాడుకున్న బీఆర్ఎస్ నాయకులు
–ఎమ్మెల్సీగా అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు టెంట్ వేసుకొని సమస్య పరిష్కరించలేదు
–మతి భ్రమించి మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డి బతుకంతా వివాదాలే
–టీపీసీసీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దళిత బంధు పేరిట దగా చేసింది ముమ్మాటికీ బీఆర్ఎస్ నాయకులేనని టీపీసీసీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్ పేర్కొన్నారు. గురువారం ఆయన వలేకరులతో మాట్లాడుతూ …దళిత బంధు నిధులు ఫ్రీజింగ్ చేసి ఆ నిధులను దారి మళ్లించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రమేష్ ఆరోపించారు. ఈ విషయం అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న కౌశిక్ రెడ్డికి తెలిసి దానిని కప్పిపుచ్చి ఎన్నికలలో లబ్ధి పొందేందుకు తనను గెలిపిస్తేనే రెండో విడత వస్తుంది అని మభ్యపెట్టి ఓట్లు దండుకున్నాడని, తీరా గెలిచాక ముఖం చాటేసి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉన్న సమస్యలను గాలికి వదిలేసి కెసిఆర్, కేటీఆర్ మెప్పు పొందేందుకు పూటకో మాట మాట్లాడుతూ అవాకులు చెవాక్కులు పేలుతూ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ పబ్బం గడుపుకుంటున్నాడన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు దళిత బంధు పేరిట భారీ కుంభకోణం చేశారన్నారు. ఎవరెవరు ఎంత దోచుకున్నారో పక్కా ఆధారాలతో బయటపెడతాం అని, దానిపై విచారణ జరిపించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తాం అని చెప్పారు. తప్పకుండా దళితుల పొట్ట కొట్టి డబ్బులు దండుకున్న ప్రతి ఒక్క నాయకుడి బండారం బయట పెడతామన్నారు. దళిత బంధు పేరిట రాజకీయాలు చేస్తుంది నువ్వు.. ఎమ్మెల్సీగా అధికార పార్టీలో ఉన్న నువ్వు అప్పుడు ఎందుకు టెంట్ వేసుకొని సమస్య పరిష్కరించలేదు అని అన్నారు. ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకు వెళ్ళలేదో చెప్పాలన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి వొడితల ప్రణవ్ విశేష కృషి చేస్తున్నారని, అది జీర్ణించుకోలేక కేసీఆర్ కేటీఆర్ కు బానిసగా మారి నోటికి వచ్చినట్టు కౌశిక్ రెడ్డి మొరుగుతున్నాడని రమేష్ ఘాటుగా పేర్కొన్నారు. దళిత బంధు విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, తప్పకుండా దళితులకు న్యాయం చేస్తుందని, పేద బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రమేష్ స్పష్టం చేశారు.






