దళిత బంధు పథకం స్థానంలో కాంగ్రెస్ తెస్తామన్న అంబేద్కర్ అభయ హస్తం పథకం ఏమైంది..?-కాంగ్రెస్, బిఆర్ఎస్ లు దళితుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి..బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఘాటు వ్యాఖ్యలు..

-గత ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్ నుండి ప్రారంభించిన దళిత బంధు పథకం నేడు నియోజకవర్గంలో నీరుగారిపోతుంది..

హుజురాబాద్ నియోజకవర్గంలోని దళితులకు దళిత బంధు పథకం అందని ద్రాక్షగా మారింది..

బిఆర్ఎస్ ప్రభుత్వంఅధికారంలో ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి దళిత బంధు పథకాన్ని అర్హులైన వారికి ఎందుకు ఇప్పించలే..? ఆనాడు ఎందుకు కొట్లాడలే .? నియోజకవర్గ దళిత ప్రజలు ఆయనకు ఇప్పుడే గుర్తుకు వచ్చారా..?

కాంగ్రెస్ పార్టీకి దళితులపై చిత్తశుద్ధి ఉంటే రెండో విడత దళిత బంధు నిధులను వెంటనే ఇవ్వాలి.

బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఘాటు వ్యాఖ్యలు..

మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి హుజురాబాద్: గత ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం తీసుకువచ్చిన దళిత బంధు పథకం సక్రమంగా అమలు చేయలేకపోయిందని, నేడు దళిత బంధు స్థానంలో అంబేద్కర్ అభయ హస్తం తీసుకువస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసిన కాంగ్రెస్ నేడు దాని ఊసేత్తడం లేదని, కాంగ్రెస్, బిఆర్ఎస్ లు దళితుల జీవితాలతో చెలగాటమాడుతూ, ద్రోహం చేశాయని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మండిపడ్డారు. ఆదివారం హుజురాబాద్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పైలట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్ నియోజకవర్గం నుండి ప్రారంభించిన దళిత బంధు పథకం నేటికీ నియోజకవర్గంలోని అర్హులైన దళితులకు అందని పరిస్థితికి కారణం ఎవరు ..? ఆయన ప్రశ్నించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నాడు ఎమ్మెల్సీగా ఉన్న కౌశిక్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం ద్వారా అర్హులైన వారిలో రెండో విడత మొత్తాన్ని ఆనాడు ఎందుకు ఇప్పించలేదని ఆయన ప్రశ్నించారు. నేడు ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్ రెడ్డి రాజకీయాల కోసం దళిత బంధు పథకం అమలు చేయాలని ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యంగా షెడ్యూల్ కులాల కమ్యూనిటీకి చెందిన కుటుంబాల అభివృద్ధి కోసం హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఇక్కడి ప్రాంతం నుండే పైలెట్ ప్రాజెక్టు కింద గత ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చిందన్నారు, ఈ పథకం కింద అర్హులైన ఎస్సీ కుటుంబాలు సొంత వ్యాపారాలు నిర్వహించుకుని ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు పదిలక్షల ఆర్థిక సహాయాన్ని హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా నామమాత్రం అందించి చేతులు దులుపుకుందన్నారు. నియోజకవర్గం లో పథకానికి అర్హులైన వేలాదిమంది నేడు అధికారుల చుట్టూ కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్న వారిని పట్టించుకోకుండా నియోజకవర్గ వ్యాప్తంగా పథకాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం దళిత ప్రజానీకానికి అందని ద్రాక్షగా మారిందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు స్థానంలో అంబేద్కర్ అభయాస్తాన్ని తీసుకువస్తామని హామీలు గుప్పించిందే తప్ప, ఆచరణలో చేసిందేమీ లేదన్నారు. కనీసం ఇటీవల కాలంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ పథకం ప్రస్తావనలేదని, దళిత బంధు పథకానికి కూడా నిధులు కేటాయించలేదన్నారు. దళిత బంధు పథకానికి మంగళం పాడటంతో పాటు అంబేద్కర్ అభయ హస్తాన్ని కాంగ్రెస్ సర్కార్ అటుకెక్కించిందని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దళిత ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే హుజురాబాద్ నుండి ప్రారంభమైన దళిత బంధు పథకం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తామన్న అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని నియోజకవర్గం నుండి ప్రారంభించి అర్హులైన దళితులందరికీ అందించాలని కృష్ణారెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు మరియు అధికార ప్రతినిధి జెల్ల సుధాకర్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!