
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (వేములవాడ):ఈనెల 20వ తేదిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటన నేపథ్యంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్న ప్రభాకర్ జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో చేయాల్సిన పనులపై మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పలు సూచనలు చేశారు. వేములవాడలో ఈ నెల 20 వ తేదిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న నేపథ్యంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలు వేములవాడ ఆలయంలో చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు. సిఎం సందర్శించే చైర్మన్ గెస్ట్ హౌజ్, శంఖు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసే ప్రాంతాలను పరిశీలించారు. ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉండాలని ఆదేశించారు. సమావేశం జరిగే హల్ లో విద్యుత్ ఇబ్బందులు, అదేవిధంగా మైక్ సౌండ్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించే ఎన్టీఆర్ అతిథి గృహంలో మార్పులు చేయాల్సిన అంశాలపై పలు సూచనలు చేశారు.
ఇప్పటికే ముఖ్యమంత్రి పర్యటన ఖరారైన నేపథ్యంలో స్వామి వారికి ప్రత్యేకత చేసే ప్రాంతాలు తదితర వాటిపై సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలపై ప్రత్యేక బద్రత చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూడాలని ఈవో అధికారులకు ఆదేశించారు. సమయం తక్కువ ఉన్నందున త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు. ఆలయంలో సూచనలు చేసే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. వారి వెంట సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఆలయ ఈవో ఇతర అధికారులు ఉన్నారు.







