మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజూరాబాద్: వృత్తిరీత్యా చిన్నబండికొట్టు (హోటల్) పెట్టుకొని జీవనం పొందుతున్నప్పటికి.. ప్రవృత్తి మాత్రం గత 45 ఏళ్లుగా కళా రంగంపై తన కున్న మక్కువను ప్రదర్శిస్తూ పలువురిచే హౌరా(శభాష్) అనిపించుకుంటున్న హోటల్ సత్తెన్న(సత్యనారాయణ)పై ప్రత్యేక కథనం.
తన కుటుంబంలో కళాకారులంటూ ఎవరూ లేకపోయినప్పటికీ ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక కళలో ప్రావీణ్యం సంపాదించినట్లయితే సంఘంలో ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం దానంతట అవే లభిస్తుందనే నమ్మకంతో ఓ చిరు(హోటల్) వ్యాపారి స్వయం కృషితో 45 ఏళ్లుగా కళారంగంలో రాణిస్తూ అనేక అవార్డులు, రివార్డులు అందుకోవడమే కాక అధికారులు ప్రజాప్రతినిధుల చేత సత్కారాలు పొందుతూ అభిమానుల చేత ప్రశంసలు అందుకుంటు ఔరా అనిపించుకుంటున్నాడు. వివరాలలోకెళితే..! మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామానికి చెందిన శ్రీమతి తెల్లోజు వజ్రమ్మ, శ్రీ లక్ష్మి నర్సయ్యల ఏకైక కుమారుడైన తెల్లోజు సత్యనారాయణ చెంజర్లలో ప్రాథమిక విద్య, మానకొండూర్ లో ఉన్నత విద్యను పూర్తి చేసిన తరువాత జీవనోపాధి నిమిత్తం 45 ఏళ్ల క్రితం హుజూరాబాద్ కు వచ్చి వరంగల్ రోడ్డులో ఓ ఇడ్లీ బండి పెట్టుకోవడం ద్వారా స్థానికులందరికి సుపరిచితులయ్యారు. చిన్నతనం నుండి సాంఘీక, పౌరాణిక నాటకాల పట్ల ఎంతో మక్కువ కలిగిన సత్యనారాయణ గత 45 సంవత్సరాల నుండి సాంఘిక పౌరాణిక , పద్య నాటకములు పోషిస్తున్నాడు. శ్రీ కృష్ణరాయబారము పద్య నాటికలో అర్జునుడు, నకులుడు, కృష్ణుడు, విధరుడు నాలుగు పాత్రలను పోషించి తనకు తానే సాటి అని ప్రేక్షకుల మన్ననలను అందుకున్నాడు. శ్రీరామాంజనేయ యుద్ధం పద్య నాటకంలో శ్రీరాముడు పాత్ర పోషించి ప్రజల మరియు పెద్దల మన్ననలు పొందినారు. 2004లో హుజురాబాద్ లోని నటరాజ నాటక కళాకారుల సంక్షేమ సంఘంలో సభ్యత్వం పొంది అనేక చోట్ల సత్యనారాయణ తన కళ ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. హుజూరాబాద్ మనవతా కల్చరల్ అసోసియేషన్ లో ఉపాధ్యక్షుడైన తుపాకుల మొగిలయ్య దర్శకత్వంలో రూపొందించబడిన జంగపిల్లి నాటికలో సమ్మయ్య పాత్ర పోషించి అనేక మందిచే ప్రశంసలు అందుకున్నారు. 2006 డిసెంబర్ లో బ్రహ్మంగారి జీవితచరిత్ర నాటికలో పరిపూర్ణయాచారిగా, రైతు -గోపయ్యగా, గోవిందయ్యగా పలు పాత్రలు పోషించి తన నటనాచాతుర్యాన్ని చాటుకున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతికశాఖ 2007 సెప్టెంబర్లో 150 సంవత్సరాల ప్ర ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం సిపాయిల తిరుగుబాటుపై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నానా సాహెబ్ పాత్ర పోషించి నిజామాబాద్ జిల్లా అప్పటి కలెక్టర్ రామాంజనేయులచే ప్రశంసలను, ప్రశంసాపత్రాన్ని పొందారు. కరీంనగర్, నిజామాబాద్ లో జరిగిన శాతవాహన ఉత్సవాలలో పాల్గొని కలెక్టర్లచే ప్రశంసలు పొంది ప్రశంస పత్రాలు అందుకున్నారు. 2019లో కళాకారుల సభ, ఈ 69 న్యూస్ వారి ఆధ్వర్యంలో సన్మానం, ప్రశంస పత్రాలు పొందినారు. కళా రవళి సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2021లో ప్రశంసా పత్రం, సన్మానం పొందినారు. అదే సంవత్సరంలో తెలుగు నాటక రంగ పురస్కారం అందుకున్నారు. 2023 ఫిబ్రవరిలో హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామంలో ప్రదర్శించిన తన కళకు ప్రశంసా పత్రం, సన్మానం అందుకున్నారు. 2023 సెప్టెంబర్ లో తెలుగు వెలుగు సాహితీ వేదిక శ్రీ త్యాగరాయ గాన సభ హైదరాబాదు లో సత్యనారాయణ తెలుగు వెలుగు జాతీయ అవార్డు అందుకున్నారు. అదే నెలలో మహానంది జాతీయ పురస్కారం, ప్రశంసా పత్రంతో పాటు సన్మానం పొందినారు. 2014లో అప్పటి కలెక్టర్ ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా గ్రామీణ కళామీదుగా అవార్డు అందుకున్నారు. 2008 ఫిబ్రవరిలో శ్రీ కృష్ణరాయబారము, పద్మ నాటికలో నకులుని పాత్రను పోషించడం తనకు మంచి గుర్తింపును తెచ్చిందని సత్యనారాయణ తెలిపారు. కళారంగంలో నన్ను ప్రోత్సహించిన వారికి, సహకరించిన వారికి, ప్రశంసలు, అవార్డులు అందజేసిన కళా సంస్థలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని కళాకారుడు తెల్లోజు సత్యనారాయణ తెలిపారు.
గత 45 సంవత్సరాలుగా నాటక కళా రంగంలో రాణిస్తూ ఇప్పటికీ ఔరా అనిపించుకుంటున్న సత్యనారాయణ హుజురాబాద్ ప్రాంతంతో పాటు జిల్లాలోనే కాక, రాష్ట్రంలోని కళా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందడం ఎంతో గర్వకారణం.