
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్. ప్రజలకు ఆరోగ్య సేవలు అందించే ఆసుపత్రులు ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు నడిపించాలని, లేనిపక్షంలో ఆ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హుజురాబాద్ డిప్యూటీ డిఎo హెచ్ ఓ డాక్టర్ చందు హెచ్చరించారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని సూపర్ బజార్ రోడ్డులో గల పలు ప్రైవేటు ఆసుపత్రులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా ఆసుపత్రుల్లో వచ్చే డాక్టర్లు ఎవరు? వారి యొక్క సర్టిఫికెట్లు? వారికి ఆసుపత్రికి మధ్య జరిగిన ఒప్పంద పత్రాలు? ఆసుపత్రి నడిపించుకోవడానికి అనుమతి తీసుకున్నారా..? లేదా? అన్న విషయాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఆస్పత్రిలో మెడికల్ షాప్ ఉంటే దాని రిజిస్ట్రేషన్ పత్రాలు తనిఖీలు చేశారు. పలు ఆసుపత్రుల ముందు అక్కడికి రానటువంటి డాక్టర్ల పేర్లు ఉండడాన్ని ఆయన తప్పు పట్టారు. ఈ విధంగా చేయడం ప్రజలను మోసం చేయడం కాదా అని నిర్వాహకులను ప్రశ్నించారు. వెంటనే ఆసుపత్రుల ముందు ఉన్న బోర్డులను తొలగించి కేవలం మీ ఆసుపత్రికి వచ్చే వైద్యుల పేర్లు ఉండే బోర్డులు మాత్రమే ప్రదర్శించాలని లేనిపక్షంలో ఆయా ఆసుపత్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ఆస్పత్రి ప్రారంభించాలంటే తప్పనిసరిగా వైద్య ఆరోగ్యశాఖ నుండి అనుమతి పొందాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. హుజురాబాద్ పట్టణంలో ఉన్న పలు ఆసుపత్రులపై ఫిర్యాదులు వచ్చాయని వెంటనే ఆయా ఆసుపత్రులు తమ లోపాలను సరిదిద్దుకోకపోతే నోటీసులు ఇవ్వడమే కాకుండా కేసులు కూడా పెట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. ఒక పాలీ క్లినిక్ లో కాలం చెల్లిన ప్రెగ్నెన్సీ టెస్ట్ పరికరాలు ఉండడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించి ఇలాంటివి ఎందుకు కలిగి ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి నిబంధనల ప్రకారం ఆసుపత్రులు నిర్వహణ లేకపోతే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. ప్రజలకు వైద్య సేవలను అందించడం కోసం ఏర్పాటు చేస్తున్న ఆసుపత్రులు కనీస సౌకర్యాలు మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండాలని శుభ్రత పరిశుభ్రత లేకపోతే ఎలా అని యాజమాన్యాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే మరోసారి ఆస్పత్రుల తనిఖీకి రావడం జరుగుతుందని అప్పటివరకు లోపాలను మార్చుకోకపోతే కేసులు తప్పవని ఆయన హెచ్చరించారు.









