
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:ప్రతిదీ రాజకీయంగా ఆలోచిస్తే ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదం ఉంటుందని, ఎవరికైనా ధాన్యం బోనస్ రూ.500 రాకపోతే చెప్పండి ఇప్పించే బాధ్యత తీసుకుంటానని, రెండు లక్షల పైన రుణమాఫీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంకు ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ముందుగా హుజూరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా గూడూరి రాజేశ్వరి- స్వామిరెడ్డి, వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, కమిటీ సభ్యుల చేత కరీంనగర్ జిల్లా మార్కెటింగ్ అధికారి డి ప్రకాశ్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన హుజూరాబాద్ మార్కెట్ కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. చరిత్ర లో రైతుల గురించి ఏమైనా నిర్ణయం తీసుకున్నారంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఇపుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. మొన్నటి వరకు పంట అంత కాళేశ్వరం వల్లే అన్నారని, కాళేశ్వరం లేకున్నా ఎల్లంపల్లి నుండి పొదుపుగా నీరు వాడుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా రాని పంట ఇపుడు వచ్చిందని, దీనికి ప్రకృతి కూడా సహకరించిందన్నారు. రైతుల ధాన్యము తీసుకొని రైస్ మిల్లర్లు రూ. 20 వేల కోట్లు ప్రభుత్వ సొమ్ము వారి దగ్గర ఉందని, 20 వేల కోట్లు బకాయిలు చెల్లించాలని చెప్పామన్నారు. జీరో బ్యాలెన్స్ ఉన్న రైస్ మిల్లర్ల దగ్గరకు ధాన్యం పోతుందన్నారు. డీఫాల్టర్ లు ఉన్నారని, ఇంకా ఎవరైనా ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి బకాయిలు చెల్లించాలన్నారు. ప్రతిపక్ష నేతలు కల్లల వద్దకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని, సన్న వడ్లకి రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎవరికైనా రాకపోతే చెప్పండి అని మంత్రి సూచించారు.
గతంలో లక్ష రూపాయలు రుణమాఫీ కావడానికి ఎన్ని దఫాలు పట్టిందో అందరికీ తెలుసు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట మీద నిలబడి 2 లక్షల రైతుల రుణమాఫీ చేశామని, ఎవరికైనా రుణమాఫీ కాకపోతే వ్యవసాయ అధికారులు కుటుంబ నిర్ధారణ జరుగుతుందని, దాని తర్వాత ప్రభుత్వం సమాచారం సేకరిస్తుందన్నారు. వీలైనంత తొందరలో వారికి 2 లక్షల లోపు ఉన్న వారి రుణమాఫీ పూర్తవుతుందని మంత్రి స్పష్టం చేశారు. 2 లక్షల పైన ఉన్న వారికి కూడా రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని శుభవార్త చెప్పారు. పైన ఉన్న డబ్బులు చెల్లించాలని వెంటనే 2 లక్షలు మీ ఖాతాలో జమ చేస్తామని, ఈ విషయం మీ గ్రామాల్లో చెప్పండి అని రైతులకు సూచించారు. రైతు భరోసా కూడా ఇస్తామన్నారు. మంత్రి వర్గ సబ్ కమిటీ జిల్లాల్లో పర్యటనలు చేసిందని, ప్రజల అభిప్రాయాలు సేకరించిందన్నారు. ప్రభుత్వం రైతు భరోసా పై ఒక నిర్ణయం తీసుకుందని, త్వరలోనే రైతు భరోసా కూడా ఇస్తామన్నారు.
టీఆర్ఎస్ ను బిఆర్ ఎస్ గా మార్చి మహారాష్ట్రకి వందల కార్లలో పోయి కనీసం పోటీ కూడా చేయకపోతిరని బిఆర్ఎస్ నేతలను విమర్శించారు. కాంగ్రెస్ ఓడిపోయింది అంటున్నారు..కాంగ్రెస్ ఓడిపోయింది అని సంతోషమా! మహరాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని సంతోష పడుతున్నారా… Brs నేతలు స్పష్టం చేయాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ పార్టీ డిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ లాగ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో వారికి(బిజెపికి) అండగా వ్యవహరించారు కనుకనే అందుకే టిఆర్ఎస్ ఒక్క సీటు కూడా సాధించలేకపోయారని పొన్నం ఎద్దేవా చేశారు.
ఇప్పటి వరకు ఆర్టీసీలో 110 కోట్ల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారాని, రూ .3720 కోట్ల విలువైన ప్రయాణం చేశారన్నారు. 10 లక్షల ఆరోగ్య శ్రీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500లకి గ్యాస్ అందిస్తున్నామన్నారు. ఎవరికైనా రాకపోతే అధికారులకు పిర్యాదు చేయండి అని మంత్రి సూచించారు. నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేశామని నీరు పేదలకు మొదటి దశలో వస్తాయన్నారు. 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేవని, త్వరలోనే రేషన్ కార్డులు వస్తాయన్నారు. కుల గణన సర్వే జరుగుతుందని దేశంలోనే పెద్ద మార్పుకు స్వీకారం చేయబోతుందన్నారు. రాహుల్ గాందీ చెప్పినట్టు ఈ సర్వేతో ఎవరేంతో వారికంత న్యాయం జరుగుతుందన్నారు. దేశానికి కుల గణన సర్వే దిక్సూచిగా మారుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇంకా ఎవరైనా సర్వేలో సమాచారం ఇవ్వకపోతే ఇవ్వండి అని చెప్పారు. ప్రజా పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు స్వేచ్చగా కలవ గలుగుతున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చూస్తే గల్లా ఖాళీ ఉందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయన్నారు. 11 నెలల్లోనే ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. 10 ఏళ్లలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలు అమలు చేసిన హామీలు ఏమి అమలు చేసిందో చూడాలన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ ఆధి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి శ్రీనివాస్, మేడిపల్లి సత్యంలతో కలిసి వేములవాడ ఆలయ అభివృద్ధికి శంఖు స్థాపన చేసుకున్నామని వెల్లడించారు. ముంపు ప్రాంతాల కోసం అనేక ఉద్యమాలు చేశామని, అత్తారిల్లు ముంపు ప్రాంతాలను న్యాయం చేస్తామని కేటీఆర్ మరిచారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముంపు ప్రాంతాల వారికి 4960 ఇళ్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. వేములవాడ ఆలయానికి నిత్యాన్నదాన సత్రం కోసం రూ.35.25 కోట్లు మంజూరు చేసుకున్నామన్నారు. అన్నదానం చేయాలనుకునే వారు సహకరించండి అన్నారు. ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేయవద్దు అని మంత్రి సూచించారు. రైతులకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి అని చెప్పారు. రైతు బిడ్డను రైతులకు సంబందించి అన్ని రకాల అవగాహన ఉన్నాయన్నారు. రైతుల ఎలాంటి సమస్య అయిన పరిష్కారం చేస్తమన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత మాకు తెలవకుండానే కరెంట్ పోతుండే అని, కరెంట్ కట్ సమస్య అని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నారని గ్రహించి, కావాలనే చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటే కరెంట్ సెట్ ఐపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డవారికి న్యాయం జరుగుతుందని, పని చేసిన వారికి గుర్తింపు వస్తుందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్చార్జి వొడితల ప్రణవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, ఆర్డిఓ రమేష్ బాబు, ఏ డి ఏ సునీత, జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతలు పత్తి కృష్ణారెడ్డి, భగవాన్ రెడ్డి పైసల జిల్లా నాయకులతోపాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.












