
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :
సామాన్య కుటుంబంలో జన్మించి కన్నవారి కలలను నిజం చేస్తూ… క్రమశిక్షణతో కష్టించి సాధించిన పోలీసు ఉద్యోగంలోనీ ట్రైనింగ్ లో ఆల్రౌండర్ గా నిలిచి మంత్రితో అవార్డు పొంది శభాష్ అనిపించుకున్నాడు సుంకరి సంజయ్. వివరాల్లోకి వెళితే…. హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన సుంకరి ఓదెలు -మణెమ్మలు పాలు పోస్తూ తమ పిల్లల్ని కష్టపడి చదివించుకున్నారు. ఒక్కగానొక్క కొడుకును పోలీసుగా చూడాలన్న వారి కోరికను తీర్చాలని సంకల్పంతో సంజయ్ కష్టపడి చదువుతోపాటు పోలీసు ఉద్యోగానికి సంబంధించిన ట్రైనింగ్ పొంది గత ప్రభుత్వ హయాంలో వేసిన నోటిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ అయిన తర్వాత హైదరాబాద్ అమీన్పూర్ లో పోలీస్ ట్రైనింగ్ పొందాడు అక్కడ అన్ని విభాగాల్లో ఆల్ రౌండర్ గా ప్రతిభ కనబరచడంతో ఇటీవల హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఆల్ రౌండర్ అవార్డు అందుకున్నారు. మంత్రి చేతుల మీదుగా తమ కుమారుడు అవార్డు అందుకోవడం పట్ల సంజయ్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.







