
–తక్షణమే ఈ ఘటనలపై విచారణ జరిపించాలి
–బిఆర్ఎస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పై మంత్రుల వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి…
–బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్
మండల యాదగిరి, స్వర్ణ ఉదయం ప్రతినిధి హుజురాబాద్ : ప్రభుత్వ గురుకుల పాఠశాలల విద్యార్థుల ప్రాణాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని, సక్రమంగా నిర్వహించే సత్తా లేక టిఆర్ఎస్ నేత గురుకులాల నిర్వహణ మొదటి ప్రధాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై రాష్ట్ర మంత్రులు అసత్యపు ఆరోపణలు చేయడం బాధాకరమని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో రాష్ట్రంలో గత నెలరోజులుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుంటే ప్రభుత్వంలో చలనంలేదని మండిపడ్డారు. వరుస ఘటనలతో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతుంటే తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరు తినట్లుగా వ్యవహరించడం ప్రతిపక్షాల నేతలపై లేనిపోని ఆరోపణలు చేయడం వారి కుటిల బుద్ధికి నిదర్శనం అన్నారు. ఫుడ్ పాయిజన్ కేసులు నిత్యం జరుగుతుండడంతో గురుకులాల విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని అన్నారు. ఇంత జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం విడ్డురంగా ఉందన్నారు. తక్షణమే విద్యార్థుల ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రత్యేక విచారణకు కమిటీ వేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని బండ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా సమస్యలపై బీఆర్ఎస్ వై ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్ప్ లైన్ 8522044336 ఏర్పాటు చేయడం జరిగిందని, స్థానిక ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులు గురుకుల పాఠశాలల్లో పర్యటించి విద్యార్థులకు భరోస కల్పించాల్సిన అవసరం ఉందని బండ శ్రీనివాస్ స్పష్టం చేశారు.
తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావొస్తున్నా విద్యాశాఖమంత్రి లేకపోవడం కాంగ్రెస్ పాలన అసమర్ధతకు అద్దంపడుతుందని నిప్పులు చెరిగారు. విద్యార్థుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా అని శ్రీనివాస్ నిలదీశారు. ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని విద్యాశాఖమంత్రిని నియమిస్తే విద్యార్థులకు మేలు జరుగుతుందని అన్నారు. గురుకుల పాఠశాలలో కార్పొరేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్ది ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసము ప్రసాదించేందుకు కృషిచేసిన నాటి గురుకులాల కార్యదర్శి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై మహిళా మంత్రులు లేనిపోని ఆరోపణలు చేయడం భావ్యం కాదన్నారు. ఇకనైనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై తప్పుడు ఆరోపణ చేయడం మానుకొని విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించడం పై దృష్టి పెట్టాలని బండ శ్రీనివాస్ పేర్కొన్నారు.







