–హుజురాబాద్ లో దివ్యాంగుల కొరకు కార్యాలయం కు కృషి చేస్తా
–ఇందిరమ్మ ఇళ్లల్లో అర్హులైన వారికి ప్రాధాన్యత
–మీకు ఏ అవసరం వచ్చిన మీకు అండగా ఉంటా..
ఉద్యోగ అవకాశాలకు కృషి
–అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వోడితల ప్రణవ్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వోడితేల ప్రణవ్ అన్నారు. మంగళవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కేకులు, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రణవ్ కు స్థానిక నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ…
దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది, దాంట్లో భాగంగానే దివ్యాంగుల కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసిందన్నారు. దివ్యాంగులకు రావలసిన హక్కులను పూర్తిస్థాయిలో ప్రభుత్వం అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. స్థానికంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
దివ్యాంగ సమాచారం వ్యవస్థాపక అధ్యక్షులు రాఘవుల శ్రీనివాసు మాట్లాడుతూ.. పుట్టుకతో దివ్యాంగులే అయినా కానీ సకలాంగులకు ఏమాత్రం తీసుపోని విధంగా అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగుతున్నారని తెలిపారు. సరికొత్త నైపుణ్యాలతో అనేక రంగాల్లో దివ్యాంగులు ప్రతిభ కనబరుస్తున్నారని ప్రభుత్వం గుర్తించి మరింత ప్రోత్సహించాలని కోరారు. వికలాంగులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించే విధంగా ప్రవర్తించకూడదని తోటి సోదరులుగా కుటుంబ సభ్యులుగా భావించాలన్నారు. వికలాంగులు కేవలం లోపాల కారణంగా తల్లిదండ్రులపై బంధువులపై ఇతరులపై ఆధారపడుతున్నారే తప్ప సకలాంగులతో అన్ని రంగాలలో దీటుగా నడుస్తున్నారని తెలిపారు. దివ్యాంగులలో కూడా సమాజాన్ని సరైన బాటలో నడిపించే గురువులు గాను తల్లిదండ్రులు గాను సైంటిస్టులుగాను మెకానికల్ గాను ఆర్టిస్టులు గాను మరెన్నో రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. వికలాంగుల పట్ల చిన్నచూపు చూడడం తగదని వీలైతే వారికి చేయూతనిచ్చి వారి ప్రతిభను గుర్తించి వారి జీవనోపాధికి జీవనాభివృద్ధికి తోడ్పడాలని పేర్కొన్నారు. ఎలాంటి పనులు చేసుకోలేక జీవనోపాధిని కల్పించుకోలేక కేవలం పింఛన్ మీదనే ఆధారపడి పింఛను వస్తేనే ఇల్లు గడిచే పరిస్థితి నెలకొందని గుర్తు చేశారు. అలాంటి వారికి పింఛన్లు సరైన సమయాలలో రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలకు ఇల్లు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఉపకరణాలను అందించాలని, ఇల్లు లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని, దివ్యాంగులు అయినందువల్ల కిందిస్థాయిలో గల ఇండ్లను కేటాయించి వారిని ఆదుకోవాలని వేడుకున్నారు. చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు చదువు లేని వారికి పెన్షన్లు మంజూరు చేయవలసిందిగా కోరారు. ఆరోగ్యారెంటీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినట్లుగా దివ్యాంగులకు కూడా బస్సు పాసులు పంపిణీ చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా 6000 రూపాయల పెన్షన్ వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి దివ్యాంగ సమాచారం వ్యవస్థాపక అధ్యక్షులు రాఘవుల శ్రీనివాస్, హైదరాబాద్ మండల దివ్యాంగుల కమిటీ అధ్యక్షులు కంకణాల రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు వలబోజు పర బ్రహ్మచారి, ఉపాధ్యక్షులు స్వప్న రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కట్కూరి రవీందర్, కోశాధికారి మొగిలి, సహాయ కార్యదర్శి రుద్రాల క్రాంతి కుమార్, గోరేమియా, రాజిరెడ్డి, వెంకటరమణ, శ్రీకాంత్, భాస్కర్, లింగారెడ్డి, సంపత్, అమరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.