Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం వెంటనే రైతుబంధు నిధులు విడుదల చేసి ఖాతాలో జమ చేయాలని బిఆర్ఎస్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎడవల్లి కొండారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పటి వరకూ ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. ఎన్నికల కోడ్ ముగిసి 25 రోజులు దాటుతున్నా.. క్యాబినెట్ సమావేశంలోనూ ఆ ప్రస్తావన లేదని తెలిపారు. “రైతుల కన్నీళ్లతో పునాదులు నిర్మించుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించినట్లు చరిత్రలో లేదన్నారు. ఓట్ల కోసం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యతలు ఇప్పుడు పూర్తిగా మారి పోయాయన్నారు. ఎన్నికల ముందు ఎకరానికి రూ.15,000 రైతుబంధు ఇస్తామని హామీ ఇచ్చి.. ఇప్పటికే రెండు సీజన్ల రైతుబంధుకు ఎగనామం పెట్టారని ఆరోపించారు. రైతులకు సకాలంలో రైతుబంధు ఇవ్వడానికి నిధులు లేవంటున్న రేవంత్ రెడ్డికి.. మూసీ సుందరీకరణకు, ఫోర్త్ సిటీ పేరుతో భూసేకరణకు రూ.వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి?” అని ప్రశ్నించారు. ఇకనైనా రైతుబంధు నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు డాక్టర్ సంగెం ఐలయ్య, సీనియర్ నాయకుడు పోరెడ్డి దయాకర్ రెడ్డి తదితరులున్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బిఆర్ఎస్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎడవెల్లి కొండాల్ రెడ్డి





