మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ పాఠశాల విద్యార్థిని బొడ్డు మహాలక్ష్మి, సోమవారం రోజున కరీంనగర్ లో జరిగిన 52వ రాష్ట్రీయ బాల్ వైజ్ఞానిక ప్రదర్శన 2024 -25 లో భాగంగా ఉత్తమ ప్రదర్శన కనబరిచి జిల్లా స్థాయి, జూనియర్ విభాగంలో మొదటి బహుమతి సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ మంగళవారం రోజున తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి బొడ్డు మహాలక్ష్మి మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయం తీమ్ లో భాగంగా తాను ప్రకృతి కీటక నాశకాలు మరియు విద్యుత్ బల్బ్ తో పంటలలో కీటకాలను ఎలా నివారించాలి అనే ప్రాజెక్టును సమర్థవంతంగా పూర్తి చేశానని, దీనికి పాఠశాల గైడ్ టీచర్ గోశికొండ మృత్యుంజయ సహకరించారని, జిల్లాస్థాయిలో జూనియర్ విభాగంలో ప్రథమ బహుమతి తో పాటు ప్రశంస పత్రం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తదనంతరం పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ మాట్లాడుతూ తమ విద్యార్థిని 500 కంటే ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనగా తమ విజ్ఞాన్ పాఠశాల విద్యార్థిని ప్రథమ స్థానం తో రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల చాలా సంతోషంగా ఉందని, జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం తమకి ఎంతో గర్వకారణమని, మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్ కూడా తమ విద్యార్థినిని అభినందించారని తెలిపారు. అలాగే మా పాఠశాలలో విద్యార్థులను బట్టి పద్ధతిలో కాకుండా లర్నింగ్ బై డూయింగ్ పద్ధతిలో నేర్పిస్తామని మాట్లాడారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంగళవారం రోజున విద్యార్థిని మహాలక్ష్మి అలాగే గైడ్ టీచర్ మృత్యుంజయను శాలువా, షీల్డ్ లతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్, డైరెక్టర్ తిరుపతి యాదవ్, ప్రిన్సిపాల్ కొండబత్తిని శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.