మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, డిసెంబర్ 3: తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి 14వ వర్ధంతి వేడుకలను ప్రజాసంఘాల నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణ త్యాగం చేసిన తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంత్ చారి వర్ధంతి వేడుకలను ఉద్యమ పార్టీ అని చెప్పుకునే బిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించడం పట్ల వారు అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో శ్రీకాంత్ చారి పాత్ర చాలా కీలకమైందని అన్నారు. శ్రీకాంత్ చారి ప్రాణ త్యాగం వల్లే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున లేచిందని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలకు శ్రీకాంత్ చారి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు బీమోజు సదానందం, పొడిశెట్టి వెంకట్రాజం, పల్కాల ఈశ్వర్ రెడ్డి, వేల్పుల రత్నం, మార్థ రవీందర్, పాక సతీష్, చందుపట్ల జనార్దన్, వేల్పుల ప్రభాకర్, ఆలేటి రవీందర్, రావుల వేణు, కాలకోటి శ్రీనివాస్, కేసిరెడ్డి నర్సింహారెడ్డి, ఆకునూరి అచ్యుత్, సందెల వెంకన్న, తాళ్లపెల్లి అమరేందర్, తునికి సమ్మయ్య, తీప్పారపు భువనచంద్ర, కండె తిరుపతి, పసుల స్వామి తదితరులు పాల్గొన్నారు.