
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, డిసెంబర్4: హుజూరాబాద్ పట్టణ శివారు బోర్నపల్లి సబ్ స్టేషన్ వద్ద కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సును ఓ కారు అదుపుతప్పి ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ ప్రైవేట్ సీడ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న పీవీ నాయుడు అనే వ్యక్తి కారులో కరీంనగర్ నుంచి హనుమకొండకు వెళ్తుండగా, బోర్నపల్లి సమీపంలోని సబ్ స్టేషన్ సమీపంలో బైకును తప్పించబోయి ఎదురుగా వస్తున్న సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఢీ కొట్టాడు. ఈ ఘటనలో కారు నడుపుతున్న పీవీ నాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 సిబ్బంది హుజురాబాద్ ఏరియా దవాఖానకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.









