Oplus_131072
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: భారాస పార్టీకి చెందిన హుజురాబాద్ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విధులు అడ్డగించి బెదిరించారని ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు కౌశిక్‌రెడ్డి సహా 20 మంది అనుచరులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న వారిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసేందుకు కౌశిక్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ పీఎస్‌కు వచ్చారు. ఎమ్మెల్యే వచ్చే సమయానికి బయటికి వెళ్తున్న సీఐను గమనించి తన ఫిర్యాదు స్వీకరించిన అనంతరమే వెళ్లాలని డిమాండ్ చేశారు. అర్జంట్ పని ఉంది బయటకు వెళ్తున్నా.. తిరిగి వచ్చిన తర్వాత తీసుకుంటానని సీఐ చెప్పడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో భారాస కార్యకర్తలు సీఐ వాహనాన్ని అడ్డుకుని నినాదాలు చేశారు. దీంతో సీఐ వెనక్కి వచ్చి ఎమ్మెల్యే వద్ద ఫిర్యాదు పత్రం తీసుకున్నారు. కేసు నమోదు అయిన వారిలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు.







