Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ లోని గాంధీ నగర్ లో నడుస్తున్న విశ్వ ప్రగతి పాఠశాల యజమాన్యం తమని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని హుజురాబాద్ శ్రీ వెంకటసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు పులి అరవింద్ రెడ్డి ఆరోపించారు. సోమవారం హుజురాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2010లో ఏడుగురు సభ్యులం విశ్వ ప్రగతి ఎడ్యుకేషనల్ సొసైటీ ఏర్పాటు చేసుకొని గ్రీన్ సెడ్జ్ పాఠశాలను ప్రారంభించామని అన్నారు. అప్పటి పాఠశాలకు ప్రిన్సిపాల్ గా కూడా వ్యవహరించానని అన్నారు. అనంతరం కరోనా సమయం వరకు పాఠశాల నడిపించామని అన్నారు. కరోనా సమయంలో రాష్ట్రమంతా లాక్ డౌన్ ఉండడంతో పాఠశాలను రెన్యువల్ చేయలేకపోయాం, అయినప్పటికీ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు రెన్యువల్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. పోరెడ్డి శాంతన్ రెడ్డి, విశ్వప్రగతి ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, అప్పటి ఎంఈఓ కే శ్రీనివాస్ రెడ్డి ఒక పథకం ప్రకారం ఫేక్ ఆధారాలు సృష్టించి అప్పటివరకు నడుస్తున్న గ్రీన్ సెడ్జ్ పాఠశాల పేరును మార్చి విశ్వ ప్రగతి పాఠశాలగా మార్చారని అన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయించగా కోర్టు అన్ని ఆధారాలను సేకరించి వెంటనే పాఠశాలను మూసివేయాలని తీర్పునిచ్చిందని తెలిపారు. తీర్పువచ్చి 50 రోజులు గడిచినప్పటికీ ఇప్పటివరకు పాఠశాలను మూసి వేయకపోవడంతో పలుమార్లు అధికారులను విజ్ఞప్తి చేశామని అన్నారు. ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి మమ్మల్ని ఇబ్బందికి గురిచేసిన పోరెడ్డి శాంతన్ రెడ్డి, అప్పటి ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి, విశ్వప్రగతి ఎడ్యుకేషనల్ సొసైటీ పై ఫిర్యాదు చేయగా ఈనెల 7న హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారన్నారు. వెంటనే పాఠశాలను మూసివేయాలని అధికారులను కలవగా మరో 48 గంటల సమయం కోరారని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి విశ్వ ప్రగతి పాఠశాల మూసివేయించేలా చర్యలు చేపట్టాలని అరవింద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో పోతరాజు లక్ష్మణ్ పాల్గొన్నారు.







