
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బేడ బుడగ జంగాలకు స్థలం ఉన్నవారికి ఆరు లక్షలు… స్థలం ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లల్లో 40 శాతం కేటాయించాలని బేడ బుడగ జంగం – జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు డిమాండ్ చేశారు. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల ప్రణవ్ బాబుకి బేడ బుడగ జంగం – జన సంఘం తరపున వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం జరిగిందని, ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గంలో పూరి గుడిసెలలో నివసిస్తున్న మా బేడ బుడగ జంగాలకు స్థలం ఉన్నవారికి ఆరు లక్షల రూపాయల చొప్పున 40 శాతం కేటాయించాల్సిందిగా కోరారు. స్థలం ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లల్లో కూడా 40 శాతం కేటాయించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రణవ్ బాబు తమ సమస్యను మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డికి వివరించి నిరుపేద బేడ బుడగజంగాలను ఆదుకోవాలని అన్నారు. గతంలో ఇచ్చిన పలు హామీలను కూడా నెరవేర్చి ఎస్సి ఉప కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని కోరారు. కాగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారని బేడ బుడగ జంగం_ జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారిలో బేడా బుడగ జంగం రాష్ట్ర, జిల్లా, డివిజన్ నాయకులు, కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.








