
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, డిసెంబర్ 19: హుజూరాబాద్ పట్టణంలోని బుడగ జంగం కాలనీకి చెందిన గంధం రామక్క(50) అనే గృహిణి నమ్మిన వ్యక్తి నమ్మించి గొంతు కోయడంతో తట్టుకోలేక తన ఇంట్లో ఉరివేసుకొని గురువారం ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసుల, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… కొండపర్తి మురళి గతంలో గంధం రామక్క ఇంటిలో కిరాయికి ఉండేవాడు. ఐదేళ్ల క్రితం రామక్క- సారయ్య దంపతుల ఇంటి పత్రాలను తనఖా పెట్టి మురళి లోన్ తీసుకున్న విషయంలో ఇద్దరికి గొడవలు జరిగాయి. మురళిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. అలాగే గంధం సారయ్య డబ్బులు ఇవ్వాలని మురళి కేసు పెట్టగా సివిల్ కేసు నమోదైంది. ఈ కేసు చివరిదశలో ఉంది. కోర్టు తీర్పు తనకే అనుకూలంగా వస్తుందని, అధికారులు ఇల్లు జప్తు చేస్తారని మూడు రోజుల క్రితం మురళి, అంకూస్ అనే వ్యక్తులు గంధం రామక్కకు వివరించినట్టు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, నమ్మించి లోనుకు షూరిటీ పెట్టినందుకు తమ ఇల్లు తమకు దక్కకుండా చేశాడని తీవ్ర మనస్థాపానికి గురైన రామక్క గురువారం ఉదయం ఇంట్లోనే ఉరి వేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త సారయ్య ఫిర్యాదు మేరకు మురళి, అంకూస్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.








