Oplus_131072
–మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త, నవభారత రూపశిల్పి, లెజెండ్
–ఆయన మరణం ఈదేశానికి తీరని లోటు
–మన్మోహన్ సింగ్ సేవలు
ప్రజలు ఎప్పటికీ మరువలేరు..
–కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
–మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: భారతదేశం ముద్దు బిడ్డను కోల్పోయిందని, మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు అని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థిక సంస్కర్త, ప్రజా నాయకుడు, నవ భారత రూపశిల్పి, లెజెండ్ అని, మన్మోహన్ సింగ్ చేసిన సేవలను దేశం ఎన్నటికీ మరువదన్నారు.
శుక్రవారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ
విద్యను, పరిపాలనను సమానంగా అందించిన అరుదైన రాజకీయ నాయకుల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒకరని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో కీలకపాత్ర పోషించారని, దేశానికి ఆయన చేసిన సేవ, ఆయన రాజకీయం జీవితం, వినయంతో కూడిన నడవడిక ఎప్పటికీ గుర్తుండి పోతాయని పేర్కొన్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు అని, భరత మాత ముద్దుబిడ్డల్లో ఒకరైన మన్మోహన్ కు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నానని రాజేందర్ రావు పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియ జేస్తున్నానని తెలిపారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగానే కాకుండా ఆర్థిక మంత్రిగా, ఎన్నో ఉన్నతమైన పదవుల్లో అత్యుత్తమంగా పనిచేశారని గుర్తు చేశారు.
దేశ ఆర్థిక విధానంపై బలమైన ముద్రవేశారని, పార్లమెంట్ లో ఆయన ప్రసంగాలు గొప్పగా ఉండేవని, ప్రధానిగా దేశ ప్రజల జీవితాలు మెరుగుపరిచేందుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. జ్ఞానం, సమగ్రతతో మన్మోహన్ సింగ్ దేశాన్ని ముందుకు నడిపించిన గొప్ప నేత అని పేర్కొన్నారు. దేశం దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని, మన్మోహన్ పటిష్టమైన ఆర్థిక విధానాలు దేశంలో పేదరికాన్ని తగ్గించాయని తెలిపారు. రాజకీయాల్లో కొద్ది మంది మాత్రమే ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారని, ఆ కొద్ది మందిలో ఒకరు మన్మోహన్ సింగ్ అని, ఆయన నిజాయితీ దేశానికి ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తుందని రాజేందర్రావు పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ 1970 లో భారత ప్రభుత్వం ఆర్థిక సలహాదారుగా పని చేశారని, 1976-80: రిజర్వు బ్యాంకు డైరెక్టర్గా, 1982-85: రిజర్వు బ్యాంక్ గవర్నర్ గా, 1991-96: కేంద్ర ఆర్థిక మంత్రిగా, 1998-2004 : రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా అత్యుత్తమంగా సేవలు అందించారని రాజేందర్ రావు పేర్కొన్నారు. 2004 మే 22: ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారని, 2009 మే 22 : రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని తెలిపారు. అదేవిధంగా మన్మోహన్ సింగ్ 1991 నుంచి 2024 వరకు సుదీర్ఘకాలం రాజ్యసభ సభ్యుడిగా కాలం పని చేసిన నేతగా గుర్తింపు సాధించారని తెలిపారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని రాజేందర్ రావు పేర్కొన్నారు.






