
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (మంచిర్యాల): రాబోయే రోజుల్లో అన్ని వర్గాల పట్టభద్రులకు అందుబాటులో ఉండి నిరుద్యోగ యువతకు ఉద్యోగాల రూపకల్పనలో తన వంతుగా కృషి చేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం మంచిర్యాల పట్టణంలో జిల్లాస్థాయి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రైవేటు ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, ఇన్సూరెన్స్ ఉద్యోగులు, మెడికల్ రిప్రజెంటివ్స్, మైన్స్ లో పని చేసే పట్టభద్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీటెక్, ఎంటెక్ చదువుకున్న 70 శాతం మంది యువత సింగరేణి మైన్స్ లో పనిచేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన జాబ్ క్యాలెండర్ అమలును తూచా తప్పకుండా అమలు చేస్తానని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 50 వేల ఉద్యోగాలు ఇచ్చిందని, ఈ ప్రక్రియ ఆరంభ శూరత్వం కాకుండా మిగతా నాలుగు సంవత్సరాలు కూడా అదే విధంగా ఉద్యోగ రూపకల్పనలో ముందుండాలని ఆకాంక్షించారు. నిరుద్యోగ యువతకు అండగా ఉండేందుకే ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రైవేటు జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాల యాజమాన్యాలకు ప్రభుత్వం నుండి రావలసిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఇప్పించేందుకు తన వంతుగా కృషి చేస్తానని, యాజమాన్యాలు మూడోసారి సమ్మె చేయడానికి పావులు కదుపుతున్నారని అన్నారు. గత 15 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు ఉద్యోగ భద్రతతో కూడిన (మినిమం పే స్కేల్) అమలుతో పాటు వారి ఉద్యోగాలను రెగ్యులరైజేషన్ చేయాలని సమ్మె చేస్తున్నారని, ఉట్నూర్ లో ఐటీడీఏ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని ప్రభుత్వం స్పందించి SSA-ITDA ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సమ్మెలు మంచి పరిణామం కాదని ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని కస్తూర్బా టీచర్లు సమ్మె విరమించి విధుల్లో హాజరయ్యే విధంగా ఏదైనా హామీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లైబ్రరీలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. అన్ని గ్రంధాలయాలు మౌలిక సదుపాయాలతో పాటు ప్రభుత్వ పక్షాన మధ్యాహ్న భోజనం ఏర్పాటుకు కృషి చేస్తారని అన్నారు.. బీసీ ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్లో ఫుల్ టైం ఎంప్లాయిస్ మరియు ట్రైనర్స్ ను నియమించి నిరంతరం ట్రైనింగ్ ఇచ్చే విధంగా కృషి చేయాలని అన్నారు. విఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ టీఎన్జీవో ఫంక్షన్ హాల్ లో 450 మంది బిఈడి పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువతి యువకులకు టెట్ కోచింగ్ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. రాబోయే పట్ట భద్రుల ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.



















