
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జనవరి3: వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు ఖచ్చితంగా పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని హుజూరాబాద్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు సూచించారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా పట్టణంలోని పరకాల క్రాస్ రోడ్డు వద్ద నేషనల్ లారీ డ్రైవర్లకు రహదారి భద్రతా నియమాలపై ఆర్టీఏ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంవీఐ కంచి వేణు మాట్లాడుతూ.. వాహనదారులు బయటకు వెళ్లేటప్పుడు, కుటుంబ సభ్యులు తమ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రమాదాల్లో పెద్ద దిక్కును కోల్పోతే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకొని, వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపేవారు సీటు బెల్టు పెట్టుకోవాలని, అతివేగం ప్రాణాపాయమని, మద్యం తాగి వాహనం నడపవద్దని డ్రైవర్లకు వివరించారు. ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని హెచ్చరించారు. ఓవర్ స్పీడ్ వల్ల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగి, ప్రాణ నష్టం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ నాగరాజు, హోంగార్డ్ గుర్రం శ్రీకాంత్ గౌడ్, లారీ డ్రైవర్లు పాల్గొన్నారు.







