
స్వర్ణోదయం ప్రతినిధి ములుగు, ఫిబ్రవరి 06: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో విషాద ఘటన చోటు చేసుకుంది. భద్రాది కొత్తగూడెం జిల్లా బయ్యారంలో ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న నర్సయ్య(38) ఈరోజు ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
నరసయ్య భార్య సునీత ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తుంది. భార్యాభర్తల మధ్య నెలకొన్న గొడవల వల్లనే నర్సయ్య ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. భార్య సునీతపై చర్యలు తీసుకోవాలని మృతుని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, అభిప్రాయ భేదాల కారణంగా ఆత్మహత్యలు పెరిగిపోతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో పెరిగిపోయాయి. ఒకప్పుడు ఎక్కువగా నిరక్షరాస్యులైన భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. అయినా వాటికి సర్దుకుపోయి కలిసి ఉండేవాళ్లు. కానీ, ప్రస్తుతం డిగ్రీలు, బీటెక్, పీహెచ్ఎలు చేసి, మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు కూడా చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతున్నారు.
క్షణికావేశంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొందరైతే ‘నేనేం తక్కువంటే, నేనేం తక్కువ’ అంటూ ఆధిపత్య ధోరణితో పంతాలకు పోతున్నారు. కానీ, ఈ పద్ధతి మంచిది కాదని, వివాహ బంధాన్ని నిలబెట్టుకోవాలంటే ఒకరినొకరు అర్థం చేసుకుని మెలగాలని వ్యక్తిత్వ వికాస నిపుణులు సూచిస్తున్నారు. ఒకరి కోసం మరొకరు ఆలోచించి నడుచుకుంటూ బంధాన్ని బలపరుచుకోవాలని హితవు పలికారు. కాగా ఇటీవల కాలంలో తెలంగాణ పోలీసు డిపార్ట్మెంట్ లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి.
ఇటీవల ములుగు జిల్లా వాజేడు ఎస్సై సురేష్ గన్ తో కాల్చుకొని సూసైడ్ చేసుకోగా.. ఆ తర్వాత కామారెడ్డి జిల్లాలో ఓ ఎస్సై, లేడీ కానిస్టేబుల్ చెరువులో శవాలై తేలారు. ఆ వెంటనే ఒకే రోజు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు సూసైడ్ చేసుకోగా.. మరొకరు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లా కొల్చారంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకుని కానిస్టేబుల్ సాయి సూసైడ్ చేసుకున్నాడు. వరుస ఘటనపై అప్రమత్తమైన పోలీస్ శాఖ ఆ దిశగా విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది.


