
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ : హోలీ పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు
జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా గురువారం రాత్రి ఆయన పలు సున్నితమైన ప్రాంతాల్లో పర్యటించారు. ప్రార్థన మందిరాలు, జంక్షన్ల వద్ద కేటాయించబడిన సిబ్బందిని మరియు బందోబస్తును స్వయంగా పరిశీలించారు. హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు. హోలీ పండుగ రోజున ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయన్నారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా, ఇతరులకు ఇబ్బంది కలగకుండా, రోడ్లపై పండుగ నిర్వహిస్తూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో పండగ జరుపుకోవాలని ఆయన సూచించారు. కమిషనరేట్ ప్రజలందరికీ కరీంనగర్ పోలీస్ శాఖ తరపున పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.








