
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం ఈ నెల 27, 28 తేదీలలో కళాశాలలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరాదేవి మరియు సదస్సు సమన్వయకర్త డాక్టర్ మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాతీయ సదస్సు కరపత్రాన్ని శాతవాహన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య యు. ఉమేశ్ కుమార్ తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో శాతవాహన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య జాస్తి రవికుమార్, సెమినార్ నిర్వాహకులు, డా. కొత్తిరెడ్డి మల్లారెడ్డి, శాతవాహన విద్యార్తులు చైతన్య, మహేష్ పాల్గొన్నారు… సెమినార్ గురించి డా. మల్లారెడ్డి వివరిస్తూ భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో భాగంగా భారతీయ ఉన్నతవిద్య మరింత స్థితిస్థాపకంగా, విద్యార్థి కేంద్రంగా ఉండాలని అందుకు సంబంధించిన నైపుణ్యాలు, సాంకేతికత మరియు నూతన ఆవిష్కరణల గురించి ఈ సెమినార్ లో చర్చించనున్నారని తెల్పారు. అలాగే భారతీయ జ్ఞానపరంపర (ఇండియన్ నాలేడ్జ్ సిస్టం) ఆవశ్యకతను గుర్తించి నూతన విద్యా విధానంలో ఈ అంశాలను సమ్మిళితం చేయడం మరియు భారతీయ సాహిత్యం, కళలు, సంప్రదాయాల పరిరక్షణ పద్ధతుల గురించి చర్చిస్తారని పేర్కొన్నారు. ఈ సెమినార్లో వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుండి పరిశోధకులు, అధ్యాపకులు, ఆచార్యులు, పారిశ్రామిక వేత్తలు మరియు విద్యావేత్తలు పాల్గొననున్నారు.
ఈ సదస్సులో చర్చించడానికి పరిశోధన పత్రాలతో హాజరుకావాలని పరిశోధకులు విద్యార్థులు మేధావులను, సదస్సు నిర్వాహకులు ఈ సందర్భంగా కోరారు…