
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో కేసీఆర్ లోపాయికార ఒప్పందం కుదుర్చుకున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అన్నీ కోణాల్లో నుంచి పరిశీలించి సత్తా ఉన్న నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేశామని తెలిపారు. సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి వుట్కూరి నరేందర్ రెడ్డి కరీంనగర్ లో నామినేషన్ దాఖలు చేశారు. భారీ ఎత్తున ర్యాలీ చేపట్టి నామినేషన్ వేశారు. మహిళల కోలాటాలు, డప్పుచప్పుళ్లు, ఒగ్గుడోలు కళాకారుల నృత్యాల నడుమ ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు అండగా నిలుస్తోందని తెలిపారు. కాంగ్రెస్ అంటే కమిట్మెంట్ పార్టీ అని కొనియాడారు. కేసీఆర్ ఏడాదికి 5వేల ఉద్యోగాలిస్తే, సీఎం రేవంత్ రెడ్డి నెలలకు 5వేల ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పారు. కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్ రూపాయి కూడా తీసుకు రాలేదని ఆరోపించారు. బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై నలుగురు ఎంపీలు సమాధానం చెప్పాలన్నారు.
కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ . గ్రాడ్యుయేట్లకు కాంగ్రెస్ ఎంతో మేలు చేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నాలుగు జిల్లాల్లో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆనాటి ప్రభుత్వాన్ని జీవన్ రెడ్డి గడగడలాడించారని చెప్పారు.
పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పట్టభద్రుల విద్యావ్యవస్థను మార్పు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ అర్బన్ నక్షలైట్లను ప్రోత్సహిస్తుందంటూ బీజేపీ చేసిన ఆరోపణలను తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ అని గుర్తు చేశారు. మతతత్వ బీజేపీని ఓడించాలని కోరారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తన విజయాన్ని కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్ గా అందిస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు. జీవన్ రెడ్డి తనకు రోల్ మోడల్ అని ఆయన స్ఫూర్తితో పని చేస్తానని తెలిపారు. సింగరేణి లో మైనింగ్, ఆదిలాబాద్ లో గిరిజన యూనివర్సిటీ కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రైవేట్ విద్యాసంస్థలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ ఇప్పిస్తానని చెప్పారు. బీజేపీ మతతత్వ పార్టీ అని, బీజేపీ అభ్యర్థి అజ్ఞాని అని ఆరోపించారు. ఈ ఎన్నికలు జ్ఞానికి అజ్ఞానికి జరుగుతున్న పోటీయేనని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టీపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.











