
–కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన
– కలెక్టర్ పమేల సత్పత్తికి వినతి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపూరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ పమేల సత్పత్తికి జర్నలిస్టుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బాపురావు మాట్లాడుతూ.. జర్నలిస్టుల పరిస్థితులు దారుణంగా మారాయని, అనేక ఓడిదుడుకుల మధ్య వృత్తిబాధ్యతలు నిర్వహిస్తున్నారని, చాలీచాలని వేతనాలతో బతుకులీడుస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండే మీడియాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. కనీస సమస్యలను పరిష్కరించకుండా ఏండ్ల తరబడి జాప్యం చేస్తున్నాయన్నారు. జర్నలిస్ట్ ల ఇండ్ల స్థలాల విషయంలో సర్కారు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సర్కారు రీవ్యూ పిటిషన్ వేసి వాదనలు చేయాలని, జర్నలిస్టులకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చర్యలు తీసుకోవాలెక్ని, లేకపోతే కొత్త విధానం ద్వారా ఇండ్లస్థలాలు ఇవ్వాలన్నారు. కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టి ఉద్యోగుల మాదిరిగా అమలు చేయాలన్నారు. జర్నలిస్టుల కంట్రిబ్యూషన్ ను ప్రభుత్వమే భరించాలన్నారు. ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలయ్యేలా చొరవ తీసుకోవాలన్నారు. కొత్త అక్రిడిటేషన్ కార్డులను అందజేయడంలో మీడియా అకాడమీ విఫలమైందని, ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేసిందని, వెంటనే అర్హులైన జర్నలిస్టులందరికీ కొత్త కార్డులివ్వాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా రిటైరైన జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని అమలుచేయాలన్నారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని, ఇందుకోసం ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రత్యేక రక్షణ చట్టాన్ని తేవాలన్నారు. మహిళా జర్నలిస్టులకు పనిచేసే కార్యాలయం నుంచి ఇంటి వరకు రాత్రి పూట రవాణా సదుపాయం కల్పించాలన్నారు. అర్హత ఉన్న చిన్న, మధ్య తరహా పత్రికలు ఎంపానెల్మెంట్లో చేర్చాలన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాలు వివాదంగా మారాయని వెంటనే ఆ సమస్యను పరిష్కరించి నిర్మాణ అనుమతి పత్రాలను లబ్ధిదారులకు అందజేయాలని, హుజురాబాద్ లో కేటాయించిన స్థలాలు కోర్టు వివాదంలో ఉన్నాయని అట్టి సమస్యను పరిష్కరించి పూర్తిస్థాయి అనుమతులతో జర్నలిస్టులకు అందించాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక సమస్యల పట్ల కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బిక్షపతి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నరేందుల ప్రసాద్, రాష్ట్ర కమిటీ సభ్యుడు గాదె కర్ణాకర్ రావు, నాయకులు చట్ల శంకర్, కొమ్ము గణేష్, అతికం రాజశేఖర్, శంకర్ రెడ్డి, గుండి కిరణ్, సుదర్శన్ రెడ్డి, సురేష్, రవీందర్, సతీష్, తిరుపతి, శ్రీనివాస్, జయేందర్, శేఖర్, జర్నలిస్టులు పాల్గొన్నారు.

కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు


జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి వినతిపత్రం ఇస్తున్న జర్నలిస్టు సంఘం నాయకులు