
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, మార్చి 3: హుజురాబాద్ మండలం సింగపురంలోని విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో సోమవారం ఫుడ్ ఫెస్టివల్ అందరిని అలరించింది. విద్యార్థులే స్వయంగా ఘుమఘుమలాడే రుచికరమైన వివిధ రకాల వంటలను వండి వడ్డించారు. పలు రకాల సాంప్రదాయ వంటకాలు ఆకట్టుకున్నాయి. విఎస్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివిఎన్ హనుమకుమార్ మాట్లాడుతూ..ఆహారానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, మానవుల మనుగడకు ఆహారం ముఖ్యమని అన్నారు. ఆహారాన్ని వృధా చేయవద్దని, మంచి ఆహారంతోనే ఆరోగ్యకరమైన సమాజం నిర్మితమవుతుందని అన్నారు. అందరికీ మంచి పోషకాహారం అందినప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందిన జాబితాలో చేరుతుందని అన్నారు. మంచి ఆహారం ద్వారా రోగాలు దూరం అవుతాయని చెప్పారు. ఆహారంలో అన్ని రకాల ప్రోటీన్లు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ లేకుండా సేంద్రీయ ఎరువులతో సాగు చేస్తున్న ఆర్గానిక్ పంటలకు ప్రస్తుతం ఎంత ప్రాధాన్యత పెరిగిందని అన్నారు. మన దేశం అభివృద్ధి బాటలో ఉన్నప్పటికీ ఇప్పటికీ నిరుపేద వర్గాలకు ఆహారం అందరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోషకాహారానికి, సిరిధాన్యాలకు పూర్వవైభవం వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



