
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్,మార్చ్ 03: వరంగల్ సమీపంలోని మడికొండలో నిర్మించనున్న డంపింగ్ యార్డ్ ప్రతిపాదనకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో, అక్కడి ప్రణాళికలను నిలిపివేసి, హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు అధికారులు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా, సంబంధిత స్థలాన్ని పరిశీలించినట్లు సమాచారం. ఈ ప్రణాళిక అమలులోకి వస్తే, హుజురాబాద్ పట్టణంతో పాటు పరిసర గ్రామాలకు తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. వ్యవసాయ ప్రధాన ప్రాంతమైన హుజురాబాద్ మండలంలో భూసారం నాశనం, భూగర్భ జలాల కలుషితమవడం, వాతావరణ మార్పులు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో వ్యవసాయ పంటల దిగుబడి తగ్గడమే కాకుండా, ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్, అలర్జీ వంటి జబ్బులు పెరుగుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రజల డిమాండ్:
హుజురాబాద్,చుట్టుపక్కల గ్రామాల ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి, పర్యావరణానికి ముప్పు కలిగించే నిర్ణయాలను పునఃసమీక్షించాలని వారు కోరుతున్నారు.
