
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 1, గ్రూప్ 2 తదితర నియామకాలలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హుజురాబాద్ తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ తుంగ ఆంజనేయులు మాదిగ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను దేశంలోనే తెలంగాణలో ముందుగానే అమలు చేస్తామని, ఇప్పటికే ప్రకటించిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా మాదిగలకు మాట ఇచ్చి ప్రస్తుతం వర్గీకరణ లేకుండానే గ్రూప్ 1, గ్రూప్ 2 తదితర ఫలితాలను ప్రకటించటం అనేది మాదిగలను మోసం చేయటమే అవుతుందని విమర్శించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగల ఉద్యమం తీవ్ర రూపం దాల్చకముందే ఉద్యోగ నియామకాలను వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు నిలుపుదల చేసి తర్వాత వర్గీకరణ ప్రకారం నియామకాలు జరపాలని డిమాండ్ చేశారు. ఈరోజు దీక్షలో కూర్చున్న వారిలో ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్, మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు వేల్పుల రత్నం, కలవల మల్లయ్య, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మొలుగూరి ప్రభాకర్, బొడ్డు సమ్మయ్య, కలకోటి సమ్మయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
