
–రుణమాఫీ పై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు , వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా ఉంది..
–వన్ నేషన్, వన్ ఎలక్షన్ దేశానికి ఎంతో అవసరం…
–బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి…
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే రుణమాఫీపై శ్వేత పత్రం విడుదల చేయాలని, రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా ఉందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. నేటికీ జిల్లాలో వేలాది మంది రైతులు రుణమాఫీ కోసం రైతులు కాళ్ళ అరిగేలా సంబంధిత కార్యాలయాలు అధికారుల చుట్టూ తిరుగుతున్నారని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. బిజెపి హుజురాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రోజున వన్ నేషన్, వన్ ఎలక్షన్ పై వర్క్ షాప్ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ వన్ నేషన్, వన్ ఎలక్షన్ (జమిలి ఎన్నికలు) దేశానికి ఎంతో అవసరమన్నారు. జమిలి ఎన్నికల విధానంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని, దీనివల్ల ప్రజాధనాన్ని వృధా కాకుండా కాపాడుకోవచ్చన్నారు. తరచూ ఎన్నికల వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, ప్రభుత్వ పాలనకు, సంక్షేమ పథకాల అమలుకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా జమిలి ఎన్నికల విధానం దేశానికి కొత్తేమీ కాదని, 1967 సంవత్సరంలోనే వన్ నేషన్, వన్ ఎలక్షన్ లు జరిగాయన్నారు. జమిలి ఎన్నికలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే జమిలి ఎన్నికల విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి, విస్తృత చర్చ కార్యక్రమాలు చేపట్టడానికి బిజెపి శ్రేణులు తగిన కృషి చేయాలన్నారు. దేశ భవిష్యత్తు, అభివృద్ధి కోసం ఎంతో అవసరమైన జమిలి ఎన్నికల విషయంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తుందన్నారు. ప్రజలకు మేలు చేసే ఏ విషయాన్నైనా కాంగ్రెస్ వ్యతిరేకించడం అలవాటుగా మార్చుకుందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ల జాతీయ నాయకత్వ బాటలోనే నడుస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి వారి జీవితాలతో చెలగాట మాడుతుందన్నారు. ఆరూ గ్యారంటీలు, 420 హామీలు, అడ్డగోలు వాగ్దానాలతో ప్రజలను నయవంచన గురి చేసిందన్నారు. అన్నం పెట్టే రైతన్నను కూడా తీవ్రంగా మోసం చేసిందన్నారు. రుణమాఫీ పై అనేక ఆంక్షలు, కోర్రిలు, నిబంధనలు పెట్టి రైతాంగాన్ని ఏడిపిస్తుందన్నారు. సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెండు లక్షల పై రుణం ఉన్నవారికి, రుణమాఫీ వర్తించదని ప్రకటన చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో అందరికీ రుణమాఫీ చేస్తామని, నేడు కొందరికే రుణమాఫీ చేస్తూ రైతులను కాంగ్రెస్ సర్కార్ నట్టేట మోసం చేసిందని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. ఈ సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు కార్యక్రమ కో ఆర్డినేటర్స్ సబ్బని రమేష్, బోరగాల సారయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, అంకటి వాసు, యాంసాని శశిధర్, యాళ్ల సంజీవరెడ్డి, కొలిపక శ్రీనివాస్,గంట సంపత్, కొలిపాక వెంకటేష్, మునిగంటి నాగరాజు, రాపాక రాజు, భాస్కర్ యాదవ్, వేముల హృతిక్, వెంకటేష్, నీలం రవీందర్, చెతర్ సింగ్, తాళ్లపల్లి దేవేంద్ర, సబ్బని మాధవి, మొలుగూరి అపర్ణ, కోలిపాక అజయ్ బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి..

సమావేశంలో మాట్లాడుతున్న పట్టణ అధ్యక్షుడు రాజు..

కార్యక్రమానికి హాజరైన బీజేపీ నాయకులు, కార్యకర్తలు..





