
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: భారతీయ జనతా పార్టీ స్థాపన దినోత్సవాన్ని కరీంనగర్లో బీజేపీ ఘనంగా నిర్వహించింది. పార్టీ ఏర్పడి 45 ఏళ్లు పూర్తైన సందర్భంగా, మాజీ మేయర్ వై యాదగిరి సునీల్ రావు నేతృత్వంలో 33వ డివిజన్లో పార్టీ కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలపై అవగాహన పెంచేందుకు “రచ్చబండ” కార్యక్రమం చేపట్టి, స్థానికులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా “స్వచ్ఛ భారత్” పథకం కింద స్థానిక పోలీస్ క్వార్టర్స్‌లోని ప్రభుత్వ పాఠశాలలో శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాలలోని మరుగుదొడ్లను పరిశీలించి, మధ్యాహ్న భోజన వసతులపై సమీక్ష చేపట్టారు. ఉపాధ్యాయులతో విద్యార్థుల సమస్యలపై చర్చించి, నాణ్యమైన భోజనం అందించాలన్న సూచనలు చేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన సునీల్ రావు, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఉచిత బస్సు పథకం మినహా ఇతర హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పెన్షన్ పెంపు కేవలం మాటలకే పరిమితమైందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రజలను మభ్యపెట్టడానికే ఉపయోగించారని విమర్శించారు. సన్న బియ్యం పథకానికి కేంద్రం 98% నిధులు ఇస్తుంటే, రాష్ట్రం కేవలం 2% నిధులతో క్రెడిట్ తానే తీసుకుంటోందని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మంజూరైన ఇండ్లకు కేంద్ర నిధుల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉన్నదని, ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోనే పేద, మధ్య తరగతి ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












